18 August, 2026 | 7:21 PM

సర్వాయి పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం

18-08-2026 06:50 PM

కలెక్టర్ చిత్రా మిశ్రా

ముకరంపుర,(విజయక్రాంతి): సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం స్ఫూర్తిదాయకం,  ఆయన ఆశయాలను అందరం కొనసాగిద్దామని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సర్వాయి పాపన్న 376 వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అధికారులు, బీసీ, గౌడ సంక్షేమ సంఘం నాయకులు సర్వాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కల్లు గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, కార్మికులకు ఎక్స్ గ్రేషియా, కాటమయ్య రక్షణ కిట్లు అందిస్తున్నట్లు వివరించారు. ఎక్సైజ్ శాఖ సమన్వయంతో జిల్లాలోని 3412 మంది కల్లుగీత కార్మికులకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కరీంనగర్ 463, మానకొండూర్ 933, చొప్పదండి 975, హుజురాబాద్ 1041 కాటమయ్య సేఫ్టీ కిట్లు అందించినట్లు పేర్కొన్నారు. నగరపాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ జనగాం జిల్లాలో ఆయన నిర్మించిన కోట ఇప్పటికీ బ్రహ్మాండంగా ఉందన్నారు.

ఆ మహనీయుడు ఆశయాలను, జీవన విధానం, దూరదృష్టి నేటి తరానికి తెలియజేయాలని పేర్కొన్నారు. చివరిగా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పాపన్న లాంటి వీరులు అన్ని వర్గాలకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో  డీఆర్ఓ స్వామి, బీసీ సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, తెలంగాణ గౌడ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మహిళా నాయకులు సుజాత గౌడ్ తదితరులు పాల్గొన్నారు.