పోటీలోనే ఉంటా.. తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

02-10-2026 | 08:41pm

రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి.   

సూర్యాపేట, అక్టోబర్ 2 (విజయక్రాంతి): నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా పేరును పార్టీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించిందనీ పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తూ, కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంటానని, నా అభ్యర్థిత్వంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ వాటిని ఎవరు నమ్మొద్దని రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి(Ramreddy Sarvottam Reddy) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ అడగలేదు, ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి సిద్ధంగా లేను, యూ టర్న్ తీసుకున్నారు అంటూ ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని పేర్కొన్నారు.

నేను ఎప్పుడూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటానని చెప్పలేదనీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం నా స్పష్టమైన నిర్ణయమనీ వివరించారు.  పట్టభద్రులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీ, ప్రభుత్వం, సంబంధిత వేదికల దృష్టికి తీసుకెళ్లడం నా ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ఇక రెండు సీట్లు రెడ్లకే అంటూ సామాజిక వర్గాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఊహాగానాలను ప్రచారం చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు