5 September, 2026 | 10:54 PM

సీఎంకు ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయమా?‌‍

05-09-2026 | 08:56pm

ప్రభుత్వాన్ని నిలదీసిన ఎంపీ రఘునందన్ రావు 

పటాన్ చెరులో 22 ఏ బాధితులకు సంఘీభావం 

సోషల్ మీడియాలో ఉద్యమించాలని ఉద్యోగులకు పిలుపు 

పటాన్ చెరు: రాష్ట్రంలో సిఎంకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా అని ప్రభుత్వాన్ని మెదక్ ఎంపీ రఘునందన్ రావు(Medak MP Raghunandan Rao) ప్రశ్నించారు. పటాన్ చెరు పట్టణంలోని సింఫోనీ పార్క్ హోమ్స్(Symphony Park Homes)లో శనివారం ఉదయం 22 ఏ బాధితులతో సమావేశమై వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం,రెవిన్యూ మంత్రి పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 22 ఏ పేరుతో రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

పటాన్ చెరు పట్టణంలో 55 ఎకరాల్లో 953 ఇళ్ల తో నిర్మించిన సింఫోనీ పార్కు హోమ్స్ కాలనీని 22 ఏ పరిధిలోకి తీసుకురావడాన్ని తీవ్రంగా ఖండించారు. 55 ఎకరాల రైతుల(Farmers) భూములు బిల్డర్ తీసుకుని వ్యవసాయ భూములను(Agricultural lands) వ్యవసాయేతర భూములుగా మార్చాలని దరఖాస్తు చేస్తే రెవిన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి వ్యవసాయేతర భూమీగా మార్చారన్నారు. ఆ తరువాత బిల్డర్ hmda కి వెళ్లి లే అవుట్ అనుమతి తీసుకున్నారని, అనంతరం జీహెచ్ఎంసీ(GHMC) అనుమతితో ఇల్లు నిర్మించారన్నారు.ఈ అనుమతులన్నీ చూసి సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇల్లు కొనుక్కుని గత 12 ఏళ్లుగా నివసిస్తున్నారని అన్నారు.

అనుమతులన్నీ 2013 లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని,ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వమే నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు.పాలన చేతకాక గుంపు మేస్త్రీ రేవంత్ రెడ్డి తిక్క తిక్క పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.సీఎం,రెవిన్యూ మంత్రి ఆస్తులను ఒక్కరోజులో నిషేధిత జాబితా నుంచి తొలగించిన విధంగానే సామాన్యులవి తొలగించాలని డిమాండ్ చేశారు. తప్పు జరిగిందని స్వయంగా రెవిన్యూ మంత్రి పొంగులేటి ఒప్పుకున్నప్పుడు తప్పుచేసిన వారిపై చర్యలు తీసుకుని ప్రజల ఆస్తులను 22 ఏ నుంచి ఎందుకు తొలగించరని ప్రశ్నించారు.

సాఫ్ట్వేర్ ఉద్యోగులు సోషల్ మీడియాను అస్త్రంగా మార్చుకుని ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా నిలదీస్తామని,అప్పటికీ దిగిరాక పోతే ప్రజల తరఫున పోరాడుతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా సింఫోనీ పార్క్ హోమ్స్ కి రెవిన్యూ,hmda,ghmc ఇచ్చిన అనుమతుల కాపీలను ఆయన ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి,ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి,దిశ కమిటీ సభ్యుడు కాసాల సుధాకర్,కాలనీ అధ్యక్షుడు విజయ్ రాజ్,ప్రధాన కార్యదర్శి సత్యారావు,పటాన్చెరు నియోజకవర్గం బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు