డెంగ్యూ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు
ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలి
వనపర్తి,(విజయక్రాంతి): డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, ప్రజల నుంచి అవసరమైన రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(Collector Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి పట్టణంలోని ఎన్‌టీఆర్ కాలనీలో నిర్వహిస్తున్న డ్రైడే కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. కాలనీలో ఇటీవల డెంగ్యూ కేసు నమోదైన ఇంటిని సందర్శించిన కలెక్టర్.. పరిసరాల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. డెంగ్యూ కేసు(Dengue case) నమోదైన ఇంటితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దోమల వృద్ధికి అనుకూలంగా ఉన్న నీటి నిల్వలు, డ్రైనేజీ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. జ్వర లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
ప్రతిరోజూ నీటి నిల్వల గుర్తింపు
డెంగ్యూ వ్యాప్తికి ప్రధాన కారణమైన దోమల నియంత్రణకు నీరు నిల్వ ఉండకుండా చూడాలని కలెక్టర్ సూచించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించడంతో పాటు లార్వా నియంత్రణ చర్యలను నిరంతరం చేపట్టాలని ఆదేశించారు. వనపర్తి పట్టణంలో డ్రైడే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, వారానికి ఒకరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో నీటి నిల్వలను గుర్తించి తొలగించేలా సిబ్బంది పనిచేయాలని స్పష్టం చేశారు.
ప్రజలకు అవగాహన కల్పించాలి
ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ డెంగ్యూ కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటిని సందర్శించి నీటి నిల్వలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, దోమల లార్వా కనిపించిన ప్రాంతాల్లో వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలు తమ ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, ఖాళీ పాత్రలు తదితర వస్తువుల్లో నీరు నిల్వ ఉంటే వెంటనే తొలగించాలని సూచించారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ వైద్య కేంద్రాన్ని సంప్రదించాలని కలెక్టర్ కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్, ఇతర అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.