కెమి 'కిల్స్ తెలంగాణ'!
నిప్పు లేనిదే పొగ రాదంటారు. ఈ కోవలోనే ఫ్యాక్టరీలు ఉన్న చోట పొగ, పలు రకాల రసాయనిక వ్యర్థాలు వస్తుంటాయి. అయితే, అవి ఎంత పరిమాణంలో ఉండాలి? ఏ సమయంలో విడుదల చేయాలి? ఇతరత్రా అంశాలపై నిబంధనలు ఉంటాయి. వాటి అమలులో నిర్లక్ష్యమే ఇప్పుడు ప్రాణాంతకంగా మారుతోంది. పొగతో గాలి, ఘన.. ద్రవ వ్యర్థాలతో భూమి కలుషితమవుతున్నది. ఈ ప్రమాదం కేవ లం పరిశ్రమలు ఉన్న చోటే కాదు.. గాలి, భూగర్భ జలాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.
* ఇప్పటికైనా ప్రభుత్వం, అధి కారులు నిద్ర కళ్లు తెరిచి.. నిఘా పెంచి, కాలుష్య నివారణపై చర్య లు చేపట్టకపోతే సమాజం కాటికి కాలు చాచినట్టే. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు ఇప్పటికే గర్భస్థస్థాయి నుంచే ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలనైనా అధికారులు సక్రమంగా అమలు చేయడంపై దృష్టి సారిస్తే ముప్పు నుంచి కొంచెమైనా తేరుకునే అవకాశం ఉంటుందేమో! లేదంటే బంగారు, రైజింగ్ తెలంగాణ నినాదాలు.. రాష్ట్రంలో రసాయన మరణాలకు చావుమేళాలై మార్మోగుతాయి.
కాలుష్య గరళం-3
- రాష్ట్రంలో ప్రాణాంతకంగా పారిశ్రామికత
- కేంద్ర జలశక్తి శాఖ సర్వేలో షాకింగ్ నిజాలు
- జడలు విప్పుతున్న పారిశ్రామిక, రసాయన కాలుష్యం
- చాపకింద నీరులా విస్తరించుకుంటున్న విషవలయం
- నిద్రపోతున్న నిఘా నేత్రం.. జిల్లాలకు ఫ్లోరైడ్ ముప్పు
- నోటీసులకే పరిమితమైన పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు
- కాలుష్య కారకులపై క్రిమినల్ కేసులు పెట్టేదెప్పుడు?
సంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 3(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతంలో రసాయన కాలుష్యం(Chemical pollution), గర్భస్థ శిశువుల మరణాల వెనుక ఉన్న దారుణ నిజాన్ని ‘విజయక్రాంతి’ దినపత్రికలో రెండు రోజులుగా కథనాలను చూశాం. అయితే ఈ భయంకరమైన నిశ్శబ్ద విపత్తు కేవలం ఒక్క జిల్లాకో, పటాన్‌చెరుకో పరిమితం కాలేదు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రధాన పారిశ్రామిక కారిడార్లలోని భూగర్భ జలాలు(Groundwater) నేడు ప్రమాదకర రసాయనాలతో నిండిపోతున్నాయి.
ఒకవైపు ఐటీ, ఫార్మా రంగాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న రాష్ట్రం.. మరోవైపు తీవ్రమైన భూగర్భ జలాల సంక్షోభం వైపు అడుగులు వేస్తోందని కేంద్ర ప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. కేంద్ర భూగర్భ జల బోర్డు, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి గణాంకాల ప్రకారం రాష్ట్రంలో అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతాలుగా మేడ్చల్ , మల్కాజ్‌గిరి (జీడిమెట్ల, జవహర్‌నగర్) ప్రాంతాలు ఉన్నాయి.
ఆసియాలోనే పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో ఒకటైన జీడిమెట్ల చుట్టుపక్కల భూగర్భ జలాలు పూర్తిగా రంగు మారిపోయాయి. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ లీచేట్ (చెత్త నుంచి ఇంకే కెమికల్స్) వల్ల కిలోమీటర్ల మేర బోరు నీటిలో క్యాడ్మియం, క్రోమియం, నికెల్ వంటి ప్రమాదకర లోహాలు చేరాయి. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లాలో జాతీయ రహదారి వెంబడి విస్తరించిన ఫార్మా పరిశ్రమల కారణంగా ఇక్కడి గ్రామాల్లో బోరు బావుల నుంచి ఎర్రటి నీరు, నురగలు రావడం సర్వసాధారణంగా మారింది.
పంట పొలాలు చవిటి నేలలుగా మారుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని కాటేదాన్, మహేశ్వరం ఏరియాలో ప్లాస్టిక్, టెక్స్‌టైల్స్, లెదర్ పరిశ్రమల వ్యర్థాలు మూసీ నదిని, పరివాహక ప్రాంత భూగర్భ జలాలను దారుణంగా దెబ్బతీశాయి. హైదరాబాద్ నగరం తన వార్షిక భూగర్భ జలాల్లో ఏకంగా 96 శాతం నీటిని తోడేసి, మిగిలిన నీటిని కలుషితం చేసిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
ఖర్చు తగ్గించుకునే కుట్ర
వ్యర్థాలను శుద్ధి చేసేందుకు అయ్యే ఖర్చును తప్పించుకోవడానికి కొన్ని ఫార్మా, రసాయన కంపెనీలు దొంగచాటుగా రహస్య పైపులైన్ల ద్వారా కెమికల్స్ను కాలువల్లోకి, చెరువుల్లోకి తరలిస్తున్నాయి. కొన్ని పరిశ్రమలు లోపల వందల అడుగుల లోతుకు బోర్లు వేసి, అత్యంత ఘాటైన యాసిడ్లు, రసాయన వ్యర్థాలను నేరుగా పాతాళ పొరల్లోకి పంపుతున్నారు. దీనివల్ల భూగర్భ జలాలు ఎంతలా పాడవుతున్నాయంటే, రాబోయే వందేళ్ల వరకు ఆ నీరు కనీసం ముట్టుకోవడానికి కూడా పనికిరాకుండా పోతోంది.
వర్షాలు పడినప్పుడు ఈ వ్యర్థాలు మరింత వేగంగా పక్క గ్రామాల్లోని బోరు బావుల్లోకి ప్రవహిస్తున్నాయి. రసాయన ఎరువుల మితిమీరిన వాడకం, పారిశ్రామిక వ్యర్థాల నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ నీటి నాణ్యత పడిపోయింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో నైట్రేట్ మోతాదు అనుమతించదగిన పరిమితులకంటే ఎక్కువగా ఉందని కేంద్ర నివేదిక తేల్చింది. దేశంలోనే నైట్రేట్ కాలుష్యంలో తెలంగాణ టాప్-3 స్థానంలో నిలిచినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రాణాంతకంగా ఫ్లోరైడ్ ముప్పు
రాష్ట్రంలో మితిమీరిన వాడకం వల్ల భూగర్భ జలాలు బాగా కిందకు పడిపోవడంతో, మిగిలిన నీటిలో సహజంగా ఉండే ఫ్లోరైడ్ గాఢత పెరిగి 28 జిల్లాల్లో ప్రమాదకర స్థాయికి చేరిందని నివేదికలు చెబుతున్నాయి. ప్రతి ఫ్యాక్టరీ అవుట్లెట్ వద్ద ఆటోమేటెడ్ సెన్సార్లు పెట్టి ఆన్లైన్ మానటరింగ్ చేపట్టాలని, ఒక్క చుక్క రసాయన నీరు కూడా బయటకు రాకుండా రీసైకిల్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించే యాజమాన్యాలపై నాన్-బైలబుల్ కేసులు నమోదు చేయాలని, కాలుష్య ప్రభావిత గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వమే ప్రత్యేక ఆస్పత్రులు కట్టించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
పీసీబీ తనిఖీలు.. నోటీసులకే పరిమితమా?
ఇటీవల తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి చర్యలు ముమ్మరం చేసి నిబంధనలు ఉల్లంఘించిన 305 పరిశ్రమలను పూర్తిగా మూసివేయాలని ఆదేశించింది. మరో 1,234 యూనిట్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే పర్యావరణవేత్తలు మాత్రం ఈ చర్యలు సరిపోవని వాదిస్తున్నారు. కేవలం మూసివేత నోటీసులు ఇచ్చి వదిలేయడం వల్ల కంపెనీలు కొన్ని రోజులు ఆగి మళ్లీ దొంగచాటుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని, అక్రమ పైప్లైన్లను శాశ్వతంగా తొలగించి యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెడితేనే భయం ఉంటుందని డిమాండ్ చేస్తున్నారు.
’జనవాణి - కాలుష్య నివారణి’ యాప్ వాడుకోవాలి
పరిశ్రమలు రాత్రి వేళల్లో పొగ వదిలినా, వర్షం పడినప్పుడు రసాయన నీటిని బయటకు వదిలినా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు పీసీబీ ’జనవాణి - కాలుష్య నివారణి’ యాప్‌ను, అలాగే టోల్-ఫ్రీ నెంబర్ 10741ని అందుబాటులోకి తెచ్చింది.
స్థానిక ప్రజలు కాలుష్య ఆధారాలను ఫోటోలు లేదా వీడియోలు ఈ యాప్ ద్వారా పంపితే అధికారులు తక్షణమే స్పందించే అవకాశం ఉంది. ‘మిషన్ భగీరథ‘ ద్వారా ప్రభుత్వం పైప్‌లైన్ తాగునీరు అందిస్తున్నప్పటికీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మెజారిటీ ప్రజలు వ్యవసాయం భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారు. మన భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన నీటిని, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలంటే పారిశ్రామిక లాభాల కంటే ప్రజల ప్రాణాలకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు కోరుతున్నారు.
ప్రాణాలు పోతున్నయ్..
గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో నిత్యం పరిశ్రమలు కాలువలు, చెరువుల్లోకి వదిలే కెమికల్ వ్యర్థాలతో ఖాజీపల్లివాసుల ప్రాణాలు పోతున్నాయి. పరిశ్రమల యాజమాన్యానికి, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. కాలుష్యంతో నిత్యం నరకం అనుభవిస్తున్నాం. కేన్సర్, చర్మవ్యాధులతో చస్తూ బతుకుతున్నాం. గర్భంలోనే పిండాలు, పుట్టిన శిశువులు కాలుష్యం కాటుకు బలవుతున్నారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటేనే మా ప్రాణాలు బతుకుతాయి. సురేష్, ఖాజీపల్లి గ్రామస్తుడు
కచ్చితమైన చర్యలు తీసుకుంటున్నాం
సంగారెడ్డి జిల్లాలోని పారశ్రామిక ప్రాంతంలో పరిశ్రమల నుండి రసాయన కాలుష్యాన్ని కాలువలు, చెరువుల్లో పారబోయడాన్ని తీవ్రస్థాయిలో కట్టడి చేస్తున్నాం. ఫిర్యాదులు అందిన వెంటనే ఆయా పరిశ్రమలకు నోటీసులు జారీ చేసి శాఖా పరమైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేక టీం ద్వారా పర్యవేక్షణ చేయడమే కాకుండా పరిశ్రమల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేపడుతున్నాం. అనుమతి లేకుండా ట్యాంకర్ల ద్వారా రసాయనాలను చెరువులు, అటవీ ప్రాంతాల్లో పారబోస్తే కేసులు నమోదు చేస్తున్నాం. ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేస్తే విచారిస్తాం.
విజయలక్ష్మి, ఈఈ, పీసీబీ, సంగారెడ్డి జిల్లా