వికసిత్ భారత్‌కు తెలంగాణ కీలకం
- 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్లకు చేర్చడం లక్ష్యం
- దేశ జీడీపీలో మన వాటా 10% శాతానికి పెంపు దిశగా అడుగులు
- క్యూర్-ప్యూర్-రేర్‌తో సమతుల్య అభివృద్ధి
- ఢిల్లీ సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : వికసిత్ భారత్(Viksit Bharat) లక్ష్య సాధనలో తెలంగాణ కీలక భాగస్వామిగా ముందుకు సాగుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక లక్ష్యాలను సుదూర ఆశయాలుగా కాకుండా, తక్షణ కార్యాచరణ బాధ్యతగా తెలంగాణ భావిస్తోందన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) నేతృత్వంలో శనివారం న్యూఢిల్లీ(New Delhi)లో జరిగిన ‘వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ’ సదస్సులో డిప్యూటీ సీఎం ప్రసంగించారు.
దేశం అభివృద్ధిని సాధించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటూనే, ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, ఉత్పాదకతను పెంచడం, అభివృద్ధి ఫలాలను ప్రతి పౌరుడికి, ప్రతి ప్రాంతానికి అందించడం ప్రధాన సవాలని భట్టి పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణాన్ని కేంద్రం లేదా రాష్ట్రాలు విడివిడిగా సాధించలేవని, సహకార సమాఖ్య స్ఫూర్తితో కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ వనరులను సమర్థంగా సమీకరించడంతో పాటు బలమైన సంస్థలు, పరస్పర సహకార విధానాలు అవసరమన్నారు.
తెలంగాణ కేవలం నిధులను కోరేందుకు కాకుండా, స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక, ఆర్థిక వనరుల సమీకరణకు నిర్దిష్ట విధానం, దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ చర్చలో భాగస్వామ్యం అవుతుందని తెలిపారు. 2025--26లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్‌డీపీ) రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని, ప్రస్తుత ధరల ప్రకారం 10.7 శాతం వృద్ధి నమోదైందన్నారు. స్థిర ధరల ప్రకారం వాస్తవ జీఎస్‌డీపీ వృద్ధి 8.5 శాతంగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
రెండింతలు పెరిగిన తలసరి ఆదాయం
రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది జాతీయ సగటు రూ.2,19,575తో పోలిస్తే దాదాపు రెండింతలు అధికమని భట్టి వివరించారు. సేవల రంగం 13.5 శాతం, ద్వితీయ రంగం 9.4 శాతం వృద్ధి సాధించాయని తెలిపారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1.21 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనా ఉందని, అయితే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని సంకల్పించామని ప్రకటించారు.
తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను ప్రస్తుతం ఉన్న దాదాపు 5 శాతం నుంచి 10 శాతానికి పెంచాలన్నది లక్ష్యమన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు, సంస్థాగత నిధులు, సావరిన్ ఫండ్స్ నుంచి అధిక మొత్తంలో పెట్టుబడులను సమీకరించి, ప్రభుత్వ నిధులను వ్యూహాత్మకంగా వినియోగించే నమూనా వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు. అభివృద్ధి ఒకే నగరానికి పరిమితం కాకూడదని, అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలు వెనుకబడకూడదన్న లక్ష్యంతో తెలంగాణ క్యూర్-ప్యూర్-రేర్ పేరుతో మూడు పరస్పర అనుసంధానిత ఆర్థిక ప్రాంతాలతో ప్రత్యేక అభివృద్ధి నమూనాను రూపొందించిందని భట్టి చెప్పారు.
దేశంలో భవిష్యత్ నగరాలకు నమూనాగా 30 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో తొలి నెట్-జీరో, ఏఐ ఆధారిత గ్రీన్ మెగాసిటీగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు, క్లీన్ టెక్నాలజీ పార్కులు, పర్యావరణహిత నివాస ప్రాంతాలు ఇందులో భాగంగా ఉంటాయని వివరించారు. తెలంగాణ యువతే రాష్ట్రానికి అతిపెద్ద బలమన్నారు.
సామాజిక భద్రత, అందుబాటులో వైద్యం, నాణ్యమైన గృహ వసతి, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు ద్వారా అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నదే తమ విధానమన్నారు. సదస్సులో తెలంగాణ నుంచి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు.