సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో విశిష్టమైనది

17-09-2026 | 10:26pm

- కలెక్టర్ కుమార్ దీపక్ 

మంచిర్యాల టౌన్, (విజయక్రాంతి): సమాజ నిర్మాణంలో విశ్వకర్మల పాత్ర ఎంతో విశిష్టమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. గురువారం విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డీసీపీ ఎగ్గడి భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, ది అఖిల్ భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారిలతో కలిసి హాజరై విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాలలో విశ్వకర్మను దైవ శిల్పిగా, నిర్మాణకర్తగా గౌరవిస్తారని తెలిపారు. అనేక దివ్య నిర్మాణాలు, ఆయుధాలు, నగరాలు, శిల్పాలను రూపొందించినవారిగా పురాణాలలో విశ్వకర్మ ప్రస్తావన ఉందని, భారతీయ శిల్పకళ, వాస్తుకళ, నిర్మాణ నైపుణ్యాల సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారని తెలిపారు.

విశ్వకర్మ సమాజానికి చెందిన వృత్తిదారులు వడ్రంగి, కమ్మరి, స్వర్ణకారులు, కంచరి, శిల్పకళ తదితర సంప్రదాయ వృత్తులను కొనసాగిస్తూ సమాజానికి అవసరమైన వస్తువులు, పనిముట్లు, నిర్మాణాలు, కళాఖండాలను రూపొందిస్తూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. నిర్మాణ రంగంతో పాటు వివిధ వృత్తులు, కళలు కాలానుగుణంగా ఎంతో అభివృద్ధి చెందాయని, నేటి తరం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలని తెలిపారు. అనంతరం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు చేపట్టిన స్వచ్ఛత హి సేవ కార్యక్రమం సంబంధిత గోడ ప్రతులను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ లతో కలిసి ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు