బాబోయ్ చిరుత.. భయం భయంగా భక్తులు
తిరుమల: తిరుమలలో చిరుతపులి సంచారం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అలిపిరి నడకమార్గం(Alipiri Footpath)లో చిరుతపులి కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. అలిపిరి(Alipiri) నడకమార్గంలోని 2,754వ మెట్టు సమీపంలో చెట్టుపై చిరుతపులిని కొందరు భక్తులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన భక్తులు భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. చిరుత సంచారం నేపథ్యంలో నడకమార్గంలో భద్రతా చర్యలను టీటీడీ మరింత పెంచింది.
భక్తులను గుంపులు గుంపులుగా దర్శనానికి పంపిస్తున్నట్లు సమాచారం. అటవీశాఖ సిబ్బంది కూడా చిరుత కదలికలను పరిశీలిస్తూ, భక్తుల భద్రతకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. చిరుత కనిపించిన ప్రాంతంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నడకమార్గంలో ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా ప్రయాణించాలని, అటవీ ప్రాంతం వైపు వెళ్లకూడదని సూచనలు చేస్తున్నారు.