పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

22-09-2026 | 08:21pm

జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

ములుగు, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌(District Collector Borkhade Hemant) సహదేవరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో  జిల్లాలో నిర్వహించే ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాల ఏర్పాట్లు, నిర్వహణపై పర్యాటక, విద్యా, పురావస్తు, అటవీ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చారిత్రక ఆలయాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు కల్పించాలని, అందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.

యువ టూరిజం క్లబ్ లో నమోదయి ఉన్న విద్యార్థులకు  పర్యాటక, వారసత్వ సంపద పై మండల, జిల్లా స్థాయి వ్యాసరచన, చిత్రలేఖన, వక్తృత్వ పోటీలను నిర్వహించాలని డీఈఓ, డిఐఈఓలకు సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం నేపథ్యంలో ఈ నెల 25న వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామం గొల్లల గుడి వద్ద హెరిటేజ్ వాక్ ను పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించాలని పేర్కొన్నారు. హెరిటేజ్ వాక్ లో యువ టూరిజం క్లబ్ విద్యార్థులు, యువత, అధికారులు, ప్రజలు పాల్గొనాలని సూచించారు. రామప్ప ఆలయ ప్రాంగణంలో 

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని సంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు పర్యాటకశాఖ ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. 26న ఉదయం 8 గంటలకు తెలంగాణ దర్శిని కార్యక్రమంలో భాగంగా యువ టూరిజం క్లబ్ విద్యార్థులకు జిల్లాలోని చారిత్రక ప్రదేశాలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, జిల్లా అదనపు కలెక్టర్ సంపత్ రావు, ఇంచార్జీ  జిల్లా పర్యాటక శాఖ నోడల్ అధికారి ధర్మ నాయక్ డీఈవో సిద్ధార్థ రెడ్డి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు