100 శాతం సుంకాలు
- బిల్లుపై సంతకం చేసిన ట్రంప్
- చట్టంగా మారిన బిల్లు
- భారత్‌కు ప్రత్యామ్నాయ దారులు అనేకం
- సుంకాలను తప్పించుకునే వాణిజ్యానికి రెఢీ
వాషింగ్టన్, సెప్టెంబర్ 19: వంద శాతం సుంకాలతో కూడిన బిల్లు(ద లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ చట్టం శుక్రవారం (భారత కాలమాన ప్రకారం శనివారం) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(US President Donald Trump) సంతకం చేశారు. దీంతో ఈ బిల్లు చట్టంగా మారింది. దీంతో రష్యా(Russia) నుంచి చమురును కొనుగోలు(Purchase of oil) చేస్తున్న దేశాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. బుధవారం ఈ బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. అనుకూలంగా 262 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 159 ఓట్లు వచ్చాయి.
ఆగస్టులో సెనేట్‌లో కూడా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. రష్యా నుంచి అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా, భారతదేశం, స్లోవేకియా, హంగేరి, అజర్ బైజాన్‌లు ఉన్నాయి. భారత్ తన ముడిచమురు(Crude oil) అవసరాల్లో 40 శాతం కంటే ఎక్కువను ప్రస్తుతం రష్యా నుంచే కొనుగోలు చేస్తుంది. కాగా ట్రంప్ సంతకంతో వంద శాతం సుంకాలు ఇప్పటికిప్పుడే అమలులోకి రావని నిపుణులు చెబుతున్నారు. భారత్ ప్రయోజనాలకు ఇది ఎలాంటి భంగమూ కలిగించదని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
రోజుకు రష్యా నుంచి 1.6 నుంచి 2 మిలియన్ బ్యారెళ్లను భారత్ కొనుగోలు చేస్తుంది. అయితే ట్రంప్ సంతకం నేపథ్యంలో భారత్ ప్రత్యామ్నాయాలకు కూడా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రష్యాతో పరిమితంగా చమురు కొనుగోలు చేస్తూనే ట్రంప్ సుంకాలను తప్పించుకుంటూ భారత్ అవసరాలు తీరేలా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, నైజీరియా, అంగోలా, బ్రెజిల్, యూఎస్ నుంచి అత్యధికంగా కొనుగోలు చేసేందుకు రెడీగా ఉంది.
భారత్‌పై ఈ చట్టం ప్రభావం ఎగుమతుల బిల్లుపై నేరుగా పడుతుంది. దీంతో అమెరికాలో భారతీయ వస్తువులు మరింత ఖరీదైనవిగా మారతాయి. దీంతో అక్కడి కొనుగోలుదారులు ఇతర దేశాల ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, తోలు, సముద్ర ఉత్పత్తులు, రసాయానాలు వంటి అనేక రకాలైన ఉత్పత్తులను భారత్ అమెరికాకు ఎగుమతి చేస్తుంది.
ఒకవేళ అమెరికా సుంకాల ప్రకటనతో భారత్ ఇతర దేశాల నుంచి చమురును కొనుగోలు చేస్తే అది కూడా ఖరీదైనదిగానే మారుతుంది. తద్ఫలితంగా భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ ఉన్న ఒప్పందాల ప్రకారం మనదేశంపై 18 శాతం, అత్యధికంగా చైనాపై 34 శాతం సుంకాలను విధిస్తుంది. స్లోవేకియా, హంగేరి, అజర్ బైజాన్‌లపై 10 శాతం చొప్పున బాదుతోంది.