అల్లి సాగర్ లిఫ్ట్ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలి
రెంజల్లో అఖిలభారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా
బోధన్,(విజయ క్రాంతి): అల్లి సాగర్ లిఫ్ట్( Alli Sagar lift) నుంచి వెంటనే సాగునీటిని విడుదల చేసి రెంజల్, నవీపేట్, నిజామాబాద్ తదితర మండలాల పరిధిలోని వరి పంటలను కాపాడాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం రెంజల్ మండల కార్యాలయం ఎదుట సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, అనంతరం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ఐక్య రైతు సంఘం(All India United Farmers' Association) రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నడిపి నాగన్న, గుమ్ముల గంగాధర్, అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు పార్వతి రాజేశ్వర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండటంతో ఇప్పటికే సాగు చేసిన వరి పొలాలు నీరు లేక బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలు ఎండిపోతే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉందని తెలిపారు.
అల్లి సాగర్ లిఫ్ట్ నుంచి తక్షణమే నీటిని విడుదల చేయడంతో పాటు కందకుర్తి లిఫ్ట్‌ను కూడా ప్రారంభించాలని డిమాండ్ చేశారు. నాలుగు మండలాల పరిధిలో వేలాది మంది రైతులు వరి సాగు చేస్తున్నారని, వారికి సాగునీరు అందించేందుకు అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. అల్లి సాగర్ లిఫ్ట్ అనేక రైతు పోరాటాల ఫలితంగా ఏర్పాటైందని నాయకులు గుర్తుచేశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడంతో రూ.108 కోట్ల నిధులు మంజూరై లిఫ్ట్ ఏర్పాటు జరిగిందన్నారు. ఈ లిఫ్ట్ ద్వారా ఇప్పటికే రెండు పంటలకు సాగునీరు అందుతూ ఈ ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని తెలిపారు.
అదేవిధంగా ఆగస్టు 13వ తేదీ నుంచి రైతు బీమా డబ్బులు అందడం లేదని, రైతు బీమా పథకానికి యథావిధిగా బడ్జెట్ కేటాయించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి అల్లి సాగర్, కందకుర్తి లిఫ్ట్‌ల ద్వారా సాగునీరు అందించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం మండల అధ్యక్షుడు మిద్దె పెద్దులు, ఎల్. గంగాధర్, మన్నె పోశెట్టి, ఎర్రన్న, శ్రీపతి, మల్లేష్, సిద్ధ పోశెట్టి, మక్కన్న, ఎర్రన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
