ప్రైవేట్ టీచర్లకు భరోసా ఏదీ?
పల్లె నాగరాజు :
దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల(government and private teachers) పాత్ర అత్యంత కీలకం. అయితే.. ప్రభుత్వ ఉపాధ్యాయుల(Government teachers)తో పోలిస్తే ప్రైవేట్ ఉపాధ్యాయులు అనేక ఆర్థిక, ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేరళకు చెందిన లిజిమోల్ జార్జ్ అనే వ్యక్తి దేశం లోనీ ప్రైవేట్ ఉపాధ్యాయుల సంక్షేమం, భద్రత, ఉద్యోగ విరమణ(Welfare, Security, Retirement) తర్వాత జీవన భద్రత కోసం ఒక సమగ్ర జాతీయ విధానం రూపొందిచాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించి, స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం(Central Government) తోపాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, జాతీయ విద్యామండలికి నోటీసులు జారీ చేసింది. ఇది స్వాగతించాల్సిన పరిణామం.
ప్రత్యేక విధానం రావాలి
కేంద్ర విద్యాశాఖ(Union Ministry of Education) విడుదల చేసిన 2023-24 గణంకాల ప్రకారం దేశంలో 14.71 లక్షల పాఠశాలలు, 24.88 కోట్ల మంది విద్యార్థులు, 98 లక్షలకు పైగా ఉపాధ్యాయులు ఉన్నా రు. ఇందులో కేవలం గుర్తింపు పొందిన ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోనే 37,30,047 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వారి ఆర్థిక, సామాజిక, సంక్షేమాన్ని పట్టించుకునే ప్రత్యేక బోర్డు గానీ, విధానం గానీ లేకపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉండే విద్యార్హతలు, బోధన నైపుణ్యాలు ప్రైవేట్ ఉపాధ్యాయులకూ ఉంటాయి.
కానీ, వేతనాల్లో చాలా తేడాలు. అత్యంత తక్కువ వేతనాలతో జీవితాన్ని గడపలేక ఎంతోమంది ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకొంటున్నారు. శ్రమ దోపిడీకి గురవుతున్నారు. జీవన వ్యయానికి తగినట్లుగా జాతీయ స్థాయిలో వారికోసం ఒక కనీస వేతన స్కేల్‌ను నిర్ణయించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం ప్రత్యేక విధానం రావాలి.
పదవీ విరమణ తర్వాత..!
దశాబ్దాల తరబడి బోధనా రంగంలో తమ అమూల్యమైన జీవితాన్ని ప్రైవేట్ ఉపాధ్యాయులు వెచ్చించి పదవీ విరమణ పొందిన తర్వాత వారికి ఎటువంటి ఆర్థిక భరోసా దక్కడం లేదు. 2004 తర్వాత నియామకమైన ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడాసీపీఎస్ విధానం వల్ల ఉద్యోగ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక భరోసా లేకుండా పోయింది. ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్), ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ లాంటి సదుపాయాలను ప్రతి ప్రైవేట్ పాఠశాలలో అమలు చేస్తే ఉద్యోగ విరమణ తర్వాత కొంతైనా ఆర్థిక భరోసా లభిస్తుంది. ఇక ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న మెజారిటీ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత అనేది లేదు. కాంట్రాక్టు ప్రాతిపదికన లేదా ఎటు వంటి రాత పూర్వ క నిబంధనలు లేని ఒప్పందాలతో నియమించుకోవడం వల్ల.. యాజమాన్యాలది ఇష్యారాజ్యంగా తయారైంది.
ప్రభుత్వాలు ఆలోచించాలి
లాభాపేక్షే ధ్యేయంగా నడిచే కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య ప్రవర్తన వల్ల ఇబ్బందులకు గురవతున్న ఉపాధ్యాయులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రైవేట్ ఉపాధ్యాయులకు న్యాయం చెయ్యాలి. ప్రైవేట్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక వేతన సవరణ చట్టాలు, ఉద్యోగ భద్రత కల్పించేలా ఒక పటిష్టమైన జాతీయ విధానం రూపొందించాలి. అప్పుడే వారు శ్రమ దోపిడీకి గురికాకుండా, మానసిక ఆందోళన లేకుండా నాణ్యమైన విద్యను అందిచగలరు. దీంతో దేశ భవిష్యత్తు మరింత పటిష్టంగా రూపుదిద్దుకుంటుంది.
-- వ్యాసకర్త: తెలంగాణ ప్రోగ్రెస్సివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్),
రాష్ట్ర కౌన్సిలర్ (సెల్: 8500431793)