అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
కరీంనగర్ క్రైమ్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) రూరల్ మండలం బొమ్మకల్ గ్రామం కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో గురువారం సాయంత్రం గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించగా ఒంటిపైన కాలిన గాయాలు ఉండడంతో హత్య కోణంలో విచారణ చేపట్టారు.
మృతురాలికి సంబంధించిన వివరాలు ఏమి లభ్యం కాకపోవడంతో ఘటన స్థలం నుండి మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చరీకి తరలించి ఆచూకీ కోసం విస్తృత ప్రచారం కల్పించారు. ఈ క్రమంలో మృతురాలు దేవాదాయ శాఖ ప్రభుత్వ ఉద్యోగి కవిత (47 )గా గుర్తించారు. పోలీసుల ప్రచారంతో మృతురాలి తండ్రి శ్రీరాముల రామచంద్రం పోలీస్ లను ఆశ్రయించి మృతురాలు తమ కూతురేనని నిర్ధారించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
కవితకు 1998లో రమేష్ అనే వ్యక్తితో వివాహం జరపగా 2014లో మృతి చెందడంతో రమేష్ పనిచేసిన దేవదాయ శాఖలోని ఆమెకు ఉద్యోగం కల్పించారు. కరీంనగర్ లోని మంగమ్మ తోట వెంకటేశ్వర ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కవిత గత కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేక చికిత్స కూడా తీసుకున్నట్లు రామచంద్రం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నాడు. గతంలో కూడా పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసిందని కవిత మృతి పై ఎలాంటి అనుమానం లేదని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.