అగ్రిస్టాక్ టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేయాలి
నిర్మల్,(విజయక్రాంతి): రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని జిల్లా స్థాయి అగ్రిస్టాక్ టాస్క్ ఫోర్స్ కమిటీ(Agri-Stack Task Force Committee) సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అగ్రిస్టాక్ టాస్క్ ఫోర్స్ కమిటీతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో డిజిటల్ విధానాలను అమలు చేస్తూ రైతులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు.
ప్రభుత్వ వ్యవసాయ పథకాలు(Government Agricultural Schemes) అర్హులైన రైతులందరికీ పారదర్శకంగా అందేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రతి శాఖకు సమాచారం, గణాంకాల నిర్వహణ ఎంతో కీలకమని, అందువల్ల వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి, ఖచ్చితత్వంతో డేటాను నిర్వహించాలని సూచించారు. అగ్రిస్టాక్ ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు వెంకట మాధవరావు, రాథోడ్ రమేష్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సుజాత, ఉద్యానవన శాఖ అధికారి రమణ, డీఆర్డీఓ విజయలక్ష్మి, సీపీఓ గంగారెడ్డి, డీసీఎస్ఓ రాజేందర్, డీవీఏహెచ్ఓ సురేష్, ఏడీ ల్యాండ్ సర్వే అండ్ రికార్డ్స్ విఠల్, ఎల్డీఎం రామ్ గోపాల్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.