డెలివరీ బాయ్ చేతివాటం.. బంగారంతో జంప్!
హైదరాబాద్: నమ్మకంగా పార్శిల్ పంపిస్తే గమ్యస్థానానికి చేరుస్తాడనుకుంటే.. అందులోని బంగారు నగలతోనే రైడర్ ఉడాయించాడు. ర్యాపిడో డెలివరీ సేవలను (Rapido Parcel Delivery) ఉపయోగించుకున్న ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బంజారాహిల్స్ నుంచి నాగోలులోని బంధువుల ఇంటికి పంపించిన రూ.62,383 విలువైన బంగారు నగలను డెలివరీ బాయ్ మధ్యలోనే మాయం చేశాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పరిధిలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. వివో సంస్థలో అడ్మిన్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బంజారాహిల్స్ నుంచి నాగోలులోని తన బంధువుల ఇంటికి బంగారు నగలను పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ర్యాపిడో బైక్ పార్శిల్ సేవలను బుక్ చేసుకున్నారు. పార్శిల్‌ను సెక్యూరిటీ గార్డు ద్వారా ర్యాపిడో రైడర్‌కు అందజేశారు. అందులో రూ.62,383 విలువైన బంగారు నగలు ఉన్నాయి (Gold Jewellery Theft).
అయితే పార్శిల్ తీసుకున్న రైడర్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. మార్గమధ్యంలో పెట్రోల్ ఖర్చుల పేరుతో బాధితుడి నుంచి అదనంగా మరో రూ.100ను ఫోన్‌పే ద్వారా పంపించుకున్నాడు. దీంతో రైడర్‌పై ఎలాంటి అనుమానం రాలేదు. పార్శిల్‌ను సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తాడని బాధితుడు భావించాడు.
కానీ ఎంతసేపటికీ పార్శిల్ నాగోలులోని బంధువుల ఇంటికి చేరకపోవడంతో బాధితుడు రైడర్‌కు ఫోన్ చేశాడు. మొదట స్పందన లేకపోవడంతో పలుమార్లు ప్రయత్నించాడు. చివరకు రైడర్ బాధితుడి ఫోన్ నంబర్‌ను బ్లాక్ చేసి అదృశ్యమయ్యాడు. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు ర్యాపిడో కస్టమర్ కేర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అక్కడి నుంచి సరైన స్పందన రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
తనకు చెందిన బంగారు నగలను డెలివరీ బాయ్ దొంగిలించాడంటూ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. పార్శిల్ తీసుకెళ్లిన రైడర్ వివరాలు, ప్రయాణ మార్గం, అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాల ద్వారా అతడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు (Police Investigation).
పార్శిల్ చేరుస్తాడని నమ్మి బాధ్యత అప్పగిస్తే.. ఏకంగా నగలతోనే ఉడాయించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. డెలివరీ సేవలను ఉపయోగించుకునే సమయంలో విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేస్తోంది (Delivery Service Fraud).