రైతుల సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యం
పెద్దతండలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
ఆలేరు,(విజయక్రాంతి): తుర్కపల్లి మండలం(Turkapally mandal) పెద్దతండ గ్రామంలో రైతుల సౌకర్యార్థం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(Paddy Procurement Center) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రజాపాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు.
రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు.