25 ఏళ్ల తర్వాత ఒక్కటైన స్నేహబంధం

22-10-2026 | 05:40pm

నిజామాబాద్, అక్టోబర్,(విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం (Alumni Meet) గురువారం ఘనంగా నిర్వహించారు. 2000-01 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు పదో తరగతి పూర్తి చేసుకుని 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ రజతోత్సవ వేడుకలను (Silver Jubilee) ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి అప్పటి ప్రధానోపాధ్యాయులు మనోహర స్వామి, ఉపాధ్యాయులు సుదర్శన్, పుష్ప, రమేశ్‌తో పాటు శ్రీ సాయి రమణ కాన్వెంట్ స్కూల్ వ్యవస్థాపకులు దాదన్నగారి రమణరావు, ఉపాధ్యాయులు అల్లారి భోజన్న, హర్షవర్ధన్, ప్రకాశ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ ప్రస్తుత పరిస్థితులు, కుటుంబ నేపథ్యాలను (Family Background) సభలో పంచుకున్నారు. పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని, అప్పటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మనోహర స్వామి మాట్లాడుతూ, అప్పటి పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు అభ్యసించలేకపోయిన విద్యార్థులు తమ పిల్లల చదువుల పట్ల నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. 

శ్రీ సాయి రమణ కాన్వెంట్ స్కూల్ వ్యవస్థాపకులు రమణరావు మాట్లాడుతూ, సుమారు 30 ఏళ్ల క్రితం తాను నిర్వహించిన పాఠశాలలో అక్షరాభ్యాసం చేసిన విద్యార్థులు తనను, పాఠశాల సిబ్బందిని గుర్తుపెట్టుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఆహ్వానించడం ఆనందంగా ఉందన్నారు. తన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న పూర్వ విద్యార్థుల పిల్లల్లో ఎవరైనా చదువులో ప్రతిభ కనబరుస్తూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే, వారి విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

గణిత ఉపాధ్యాయులు ప్రకాశ్ మాట్లాడుతూ, జీవన ప్రయాణంలో ప్రతి ఒక్కరూ వివిధ స్థాయులకు చేరుకుంటారని తెలిపారు. తోటి విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని, తాము సాధారణ జీవితం గడుపుతున్నామని ఎవరూ భావించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అనంతరం పాఠశాల ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలు, జ్ఞాపికలతో (Mementos) ఘనంగా సన్మానించారు. అనంతరం పూర్వ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరిన్ని వార్తలు