పోలీస్ కమిషనరేట్‌లో బతుకమ్మ సంబరాలు

18-10-2026 | 10:57am

బోధన్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో పరేడ్ గ్రౌండ్ పండుగ శోభను సంతరించుకుంది.

ఈ వేడుకలకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఇలా త్రిపాఠి, నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు.

నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్లకు చెందిన సిబ్బంది, పోలీస్ కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది, రేంజ్ కార్యాలయ సిబ్బంది, హోంగార్డులు, అలైడ్ బ్రాంచ్‌ల సిబ్బంది తమ కుటుంబాలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ రకాల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మల చుట్టూ వలయాకారంలో తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడారు. ఆనందోత్సాహాల మధ్య సాగిన ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ

ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ప్రజల జీవన విధానానికి, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని పేర్కొన్నారు. ప్రకృతిని, పూలను పూజిస్తూ మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ తెలంగాణ ప్రజల ఐక్యతకు, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉన్నప్పటికీ, తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇటువంటి పండుగ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయతను పెంపొందించడంతో పాటు, పోలీసు కుటుంబాల మధ్య ఐక్యతను మరింత బలోపేతం చేయడానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని పేర్కొన్నారు.

అనంతరం పెద్ద సంఖ్యలో బతుకమ్మలను ఒకచోట అమర్చి, వాటి చుట్టూ మహిళలు వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడారు. ఐక్యత, ప్రేమ, సోదరభావాన్ని చాటుతూ మానవహారంగా ఏర్పడి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు అధికారులు బతుకమ్మ, విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ శ్రీ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ మల్లేష్, వివిధ పోలీస్ స్టేషన్ల సీఐలు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు