సర్వేకు ముందు నోటీసులు, గ్రామాల్లో చాటింపు

17-10-2026 | 05:46pm

మూడు దశల్లో సమగ్ర భూసర్వే

భూముల రీసర్వేకు వేగం.. ప్రతి భూమికి ప్రత్యేక భూదార్‌!

హైదరాబాద్: తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం Integrated Land Survey ప్రక్రియను వేగవంతం చేస్తోంది. భూముల హద్దులపై స్పష్టత తీసుకురావడంతో పాటు యజమానులకు హక్కుల భరోసా కల్పించేందుకు మూడు దశల్లో సమగ్ర భూ రీసర్వే నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) వెల్లడించారు. ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయిందని, అభ్యంతరాల స్వీకరణ కోసం భూ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. తొలి దశను వచ్చే నెలాఖరులోగా పూర్తి చేసే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో శనివారం రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 10,954 రెవెన్యూ గ్రామాలు ఉండగా, తొలి దశలో హైదరాబాద్‌ మినహా మిగిలిన 32 జిల్లాల్లో 2,720 గ్రామాలను ఎంపిక చేసినట్లు వివరించారు. జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేయడంతో పాటు సర్వే మ్యాప్‌లు అందుబాటులో లేని గ్రామాలనూ ఈ ప్రక్రియలో చేర్చినట్లు తెలిపారు. సర్వే పనులను వేగవంతం చేసేందుకు ఇప్పటికే కొనుగోలు చేసిన 411 రోవర్లకు అదనంగా మరో 400 రోవర్ల కొనుగోలుకు టెండర్లు ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

భూములకు డిజిటల్‌ గుర్తింపు.. ప్రత్యేక భూదార్‌ నంబర్‌

రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించేందుకు ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక Bhu Bharati BhuDhaar Number కేటాయించాలనేది ప్రభుత్వ ప్రణాళిక. ఆధార్‌ తరహాలో భూమికి ప్రత్యేక గుర్తింపు కల్పించేలా భూదార్‌ కార్డులు జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. రీసర్వేలో సేకరించిన వివరాలను డిజిటల్‌ రూపంలో భద్రపరచి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. తద్వారా భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సమయంలో ఎదురయ్యే సమస్యలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

1936 నాటి రికార్డుల నుంచి ఆధునిక టెక్నాలజీ వరకు

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ నిజాం కాలం నాటి పాత సర్వే రికార్డులే భూముల హద్దులకు ఆధారంగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. కాలక్రమేణా భూముల విభజనలు, సర్వే నంబర్ల ఉపవిభాగాలు, పట్టణీకరణ, పరిపాలనా సరిహద్దుల మార్పులతో అనేక చోట్ల భూముల అసలు హద్దులపై స్పష్టత తగ్గిందని వివరించారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సంప్రదాయ కొలత పరికరాలకు బదులుగా DGPS Survey, Rover Technology, GIS Mapping, QGIS Software వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో సుమారు 40 లక్షలుగా ఉన్న సర్వే నంబర్ల సంఖ్య ప్రస్తుతం 2.29 కోట్లకు చేరినట్లు మంత్రి వివరించారు.

పాలేరు రైతులకు త్వరలో భూదార్‌ పట్టాలు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో 665 ఎకరాలకు సంబంధించిన రీసర్వేను పూర్తిచేసినట్లు వెల్లడించారు. త్వరలో అక్కడ భూదార్‌ పట్టాల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా భూముల సరిహద్దులపై స్పష్టత పెరగడంతో పాటు భవిష్యత్తులో యాజమాన్య హక్కులకు సంబంధించి తలెత్తే వివాదాలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

సర్వేకు ముందు నోటీసులు తప్పనిసరి

భూ సర్వే నిర్వహించే ముందు సంబంధిత పట్టాదారులకు ముందస్తు నోటీసులు ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సర్వేకు ఒకటి, రెండు రోజుల ముందు గ్రామాల్లో చాటింపు చేయాలని, భూ యజమానులు తమ భూముల హద్దులను నిర్ధారించుకునేందుకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, గ్రామకంఠం పరిధుల మధ్య స్పష్టమైన హద్దులు గుర్తించిన తర్వాతే సర్వే చేపట్టాలని చెప్పారు. సర్వే పూర్తయిన గ్రామాల్లో ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. భూ రీసర్వేను కేవలం పరిపాలనా కార్యక్రమంగా కాకుండా రైతులు, భూ యజమానుల జీవితాలను ప్రభావితం చేసే కీలక ప్రక్రియగా చూడాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి భూకమతానికి స్పష్టమైన హద్దులు, ప్రతి యజమానికి హక్కులపై భరోసా కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు