శిథిలావస్థలో రుద్రూర్ వెటర్నరీ ఆసుపత్రి
పెచ్చులూడి పడుతుండటంతో సిబ్బంది, పశుపోషకుల్లో ఆందోళన
నూతన భవన నిర్మాణంపై అధికారులు దృష్టి సారించాలంటున్న పాడి రైతులు
బోధన్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): బోధన్ డివిజన్(Bodhan Division) పరిధిలోని రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ వెటర్నరీ ఆసుపత్రి(Government Veterinary Hospital) భవనం శిథిలావస్థకు చేరడంతో సిబ్బంది, పశుపోషకులు(Livestock farmers) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవనం పైకప్పు, గోడలకు సంబంధించిన పెచ్చులు ఊడిపడి కింద పడుతున్నాయని, దీంతో ఆసుపత్రిలో విధులు నిర్వహించే సిబ్బంది ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పాత భవనం కావడంతో పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడటంతో పాటు భవనం పరిస్థితి రోజురోజుకు మరింత అధ్వానంగా మారుతోందని చెబుతున్నారు.
పశువులకు వైద్యం కోసం వచ్చే పాడి రైతులు(Dairy farmers), పశుపోషకులు సైతం ఆసుపత్రిలోకి వెళ్లేందుకు భయపడుతున్న పరిస్థితి నెలకొందని తెలిపారు. వర్షాకాలంలో భవనం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని, ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. వెటర్నరీ ఆసుపత్రి భవనాన్ని అధికారులు పరిశీలించి, అవసరమైతే తక్షణ మరమ్మతులు చేపట్టడంతో పాటు నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని పాడి రైతులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.