మట్టి గణపతితో పర్యావరణ పరిరక్షణ
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత మంథనిగా తీర్చిదిద్దాలి
మంథని, సెప్టెంబర్ 13(విజయక్రాంతి): వినాయక చవితి ఉత్సవాలను పర్యావరణహితంగా నిర్వహించాలని, మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని మంథని మున్సిపల్ చైర్మన్(Municipal Chairman) వొడ్నాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ...మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం అనే నినాదంతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించాలన్నారు.
మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా నీటి కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని తెలిపారు. గణపతి ఉత్సవాల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా పర్యావరణహిత వస్తువులను ఉపయోగించాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించడంతో పాటు ప్రజల ఆరోగ్యంపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, మంథనిని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, వ్యాపారులు, యువత, ప్రజాప్రతినిధులు సమిష్టిగా సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు కుర్ర లింగయ్య, ఎల్లేంకి వంశీధర్, నాయకులు జంభోజు సమ్మయ్య, లైశెట్టి రాజుతో పాటు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు