ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేయాలి: సర్పంచుల డిమాండ్
అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం
కోనరావుపేట,(విజయక్రాంతి): గ్రామపంచాయతీల ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో ఉప సర్పంచ్‌లకు ఉన్న సంయుక్త చెక్ పవర్‌ను తక్షణమే రద్దు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Siricilla District) సర్పంచులు డిమాండ్ చేశారు. బుధవారం సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బొయిని దేవరాజు ఆధ్వర్యంలో సర్పంచులు పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. అనంతరం తమ సమస్యల పరిష్కారం కోరుతూ అదనపు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, అభివృద్ధి పనులు తదితర బాధ్యతలను సర్పంచులే ప్రత్యక్షంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే పంచాయతీ నిధుల విత్‌డ్రాయల్‌కు సంబంధించి ఉప సర్పంచ్‌లకు ఉన్న సంయుక్త చెక్ పవర్ కారణంగా అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చెక్కులు, డిజిటల్ సంతకాల విషయంలో ఆలస్యం జరుగుతుండటంతో పారిశుధ్య కార్మికుల వేతనాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. అత్యవసరమైన తాగునీరు, వీధిదీపాలు, పారిశుధ్య నిర్వహణతో పాటు వివిధ అభివృద్ధి పనుల బిల్లులు కూడా నిలిచిపోతున్నాయని ఆరోపించారు. దీంతో గ్రామాల్లో పరిపాలన సజావుగా సాగడం లేదన్నారు.సర్పంచులకు గ్రామ ప్రజల పట్ల నేరుగా జవాబుదారీతనం ఉన్నందున, వారి బాధ్యతలకు అనుగుణంగా పరిపూర్ణ అధికారాలు కల్పించాలని కోరారు. ఉప సర్పంచ్‌ల చెక్ పవర్ నిబంధనతో గ్రామాల్లో రాజకీయ విభేదాలు, ఆధిపత్య పోరు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉప సర్పంచ్‌ల చెక్ పవర్‌ను రద్దు చేసి, సర్పంచులకు పూర్తిస్థాయి ఆర్థిక, పరిపాలనా అధికారాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.