ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అటవీ శాఖ సహకారం అవసరం

04-10-2026 | 04:26pm

గిరిజన కుటుంబాల సమస్యలపై డీవీఎంసీ సభ్యుల విజ్నప్తి

గంభీరావుపేట, అక్టోబర్ 4 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)  గంభీరావుపేట మండలంలోని జగదాంబ తండాలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను(Beneficiaries of Indiramma houses) డీవీఎంసీ సభ్యులు బానోత్ నరేష్ నాయక్, భూక్యా రమేష్ నాయక్ కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిశీలించారు.

అజ్మీరా రాజి భీక్య నాయక్, అజ్మీరా లావణ్య (రమేష్, మృతి) కుటుంబాలు సుమారు 18 సంవత్సరాలుగా అక్కడే గుడిసెల్లో నివసిస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఇల్లు నిర్మించుకునే ప్రయత్నంలో అటవీ శాఖ అధికారులు అడ్డంకులు సృష్టిస్తున్నారని వారు తెలిపారు. 2018లో వారి కుటుంబంలో వివాహం కూడా అదే ప్రదేశంలో జరిగినట్టు పేర్కొన్నారు. ఇంటి పన్ను కూడా చెల్లిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా డీవీఎంసీ సభ్యుడు బానోత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ, అటవీ ప్రాంతాలకు సమీపంలో నివసిస్తున్న గిరిజన కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన అనుమతులు, భూమి సమస్యలపై అటవీ శాఖ అధికారులు మానవతా దృక్పథంతో స్పందించి సహకరించాలని కోరారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేద కుటుంబానికి భద్రత, ఆత్మగౌరవానికి ప్రతీక అని, అర్హులైన వారికి ఇళ్లు సకాలంలో పూర్తయ్యేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అటవీ, రెవెన్యూ, పంచాయతీ శాఖలు కలిసి గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గిరిజన కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని బానోత్ నరేష్ నాయక్, భూక్యా రమేష్ నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమేష్ నాయక్, గిరిజన నాయకులు భాస్కర్ నాయక్, ఇస్లావత్ సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు