నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు పంటల మార్పిడిపై దృష్టి

24-10-2026 | 05:41pm

మండల ప్రత్యేక అధికారి హనుమంత్ నాయక్

నీటి సంరక్షణకు ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలి

మండల సర్వసభ్య సమావేశంలో సమస్యలు ఏకరువు పెట్టిన సర్పంచులు

గంభీరావుపేట, అక్టోబర్ 24 (విజయక్రాంతి): రానున్న రోజుల్లో నీటి ఎద్దడి(Water Scarcity) తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో గ్రామాల్లో నీటిని పొదుపుగా వినియోగించాలని, ఎల్‌నినో ప్రభావాన్ని(impact of El Nino) దృష్టిలో పెట్టుకొని రైతులు(Farmers) పంటల మార్పిడిపై దృష్టి సారించాలని మండల ప్రత్యేక అధికారి హనుమంత్ నాయక్ సూచించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) గంభీరావుపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాజేందర్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా హనుమంత్ నాయక్ మాట్లాడుతూ తాగునీటి కొరత తలెత్తకుండా ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలు(Water conservation measures) చేపట్టాలన్నారు. ప్రతి గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రోత్సహించి, వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించాలని అధికారులకు సూచించారు. వ్యవసాయానికి నీరు, విద్యుత్ కొరత ఎదురయ్యే అవకాశమున్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలన్నారు.

కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు తొలగించాలి

కొత్తపల్లి సర్పంచ్ బాలరాజ్ గౌడ్ మాట్లాడుతూ ధాన్యం ఆరబెట్టుకునేందుకు తగిన స్థలాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అందుబాటులో ఉన్న ఇతర ప్రాంతాల్లో ధాన్యం ఆరబెట్టుకునేందుకు అనుమతించి, అక్కడి నుంచే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

లూజు విద్యుత్ లైన్లు సరిచేయాలి

గజసింగవరం సర్పంచ్ ఉమ్మారెడ్డి విమల మాట్లాడుతూ గ్రామాల్లో లూజు విద్యుత్ లైన్లతో లారీలు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ప్రమాదాలు జరగకముందే వాటిని సరిచేయాలని కోరారు.

కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించాలి

దమ్మన్నపేట సర్పంచ్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో మానేరు నది ఉన్నప్పటికీ కొన్ని గ్రామాల్లో వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాధార రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని ఆయా ప్రాంతాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి ఆదుకోవాలని కోరారు.

ఎంపీడీవో రాజేందర్ మాట్లాడుతూ విద్యుత్ లూజు లైన్ల సమస్యల పరిష్కారంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పర్యవేక్షిస్తామని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఇటీవల నూతనంగా నియమితులైన సింగల్ విండో  చైర్మన్ వేశాల వెంకటిని అధికారులు సర్పంచులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.సమావేశంలో తహసీల్దార్ మారుతి రెడ్డి, వ్యవసాయ అధికారి సలావుద్దీన్, ఏపీవో అరుణ, ఏపీఎం దేవరాజు, ఏఈలు ఆనంద్,వేణు, భవ్య, అంగన్‌వాడీ సూపర్‌వైజర్ చంద్రకళ, వివిధ గ్రామాల సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు