వీర్నపల్లిలో వైభవంగా శ్రీ దుర్గాదేవి కుంకుమ పూజలు
పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ
వీర్నపల్లి అక్టోబర్ 19 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) వీర్నపల్లి మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ సీతారామ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించిన శ్రీ దుర్గాదేవి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
అమ్మవారి కుంకుమ పూజల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు ప్రార్థించారు.భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరిసిన ఈ కార్యక్రమంతో దేవాలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారి పూజలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.