జిల్లా ప్రజలకు బతుకమ్మ, విజయదశమి శుభాకాంక్షలు: కలెక్టర్

19-10-2026 | 08:14pm

భూపాలపల్లి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): సంస్కృతి, సంప్రదాయాలు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలుగా నిలిచే బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రకృతిలో సహజంగా లభించే వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి మహిళలు, యువతులు, బాలికలు తొమ్మిది రోజుల పాటు సంప్రదాయబద్ధంగా ఆటపాటలతో బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించుకోవడం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ సామూహిక ఐక్యతను చాటిచెప్పే బతుకమ్మ పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

విజయదశమి పర్వదినం జిల్లా ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని ఆకాంక్షించారు. దసరా పండుగ ప్రతి ఒక్కరిలో నూతనోత్సాహాన్ని నింపి, మరిన్ని విజయాలు సాధించేలా దోహదపడాలని కోరుకున్నారు. జిల్లా ప్రజలందరూ బతుకమ్మ, విజయదశమి పండుగలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు.

మరిన్ని వార్తలు