గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు పరిశీలన
చెరువులను పరిశీలించిన ఎస్సై శ్రీకాంత్
గంభీరావుపేట,(విజయక్రాంతి): గణేష్ నిమజ్జనాల(Ganesh Immersion)ను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ సంబంధిత అధికారులతో కలిసి మండలంలోని చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గంభీరావుపేట చెరువు, ముస్తఫా నగర్ చెరువుల వద్ద ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ.. చెరువుల పరిసరాల్లో పారిశుద్ధ పరిస్థితులను పరిశీలించి అవసరమైన చోట పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం చెరువులలో నీటిమట్టం ఎక్కువగా ఉన్నందున నిమజ్జనం సమయంలో భక్తులు నీటిలోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలకు తావు లేకుండా విగ్రహాలను సురక్షితంగా నిమజ్జనం చేయాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట ఈవో వినీల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.