రైళ్ల కోసం కాంగ్రెస్ రణం

29-10-2026 | 05:35am
  1. రైల్వే జీఎం కార్యాలయంఎదుట మెరుపు ధర్నా
  2. ఢిల్లీ ర్యాలీకి ప్రత్యేక రైళ్ల నిరాకరణపై ఆగ్రహం
  3. అడ్డుకున్న పోలీసులు, ఉద్రిక్తత
  4. పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం సహా నేతల అరెస్ట్
  5. లాలాగూడ పోలీసుస్టేషన్‌కు తరలింపు
  6. ఎన్ని అవాంతరాలొచ్చినా ఢిల్లీకి వెళ్లి తీరుతామన్న పీసీసీ చీఫ్

హైదరాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): ఢిల్లీలో నవంబర్ 1న నిర్వహించ నున్న ఇండీ కూటమి నిరసన ర్యాలీకి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను నిరాకరించడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బుధవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (జీఎం) కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించాయి. ఈ మెరుపు ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(TPCC President Mahesh Kumar Goud), రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి లాలాగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం లో కాంగ్రెస్, ఇండీ కూటమి సంయుక్తంగా భారీ నిరసన ర్యాలీని తలపెట్టాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి కార్యకర్తలు, నాయకులను భారీగా తరలించేందుకు ప్రత్యేక రైళ్లను కేటాయించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం వారం రోజుల క్రితమే రైల్వే జీఎంకు దరఖాస్తు చేసింది. అయితే, రైల్వే శాఖ దీనిపై కాలయాపన చేసి, చివరి నిమిషంలో దరఖాస్తును తిరస్కరించింది.

కేంద్ర ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రత్యేక రైళ్లను కేటాయించేందుకు నిరాకరించిందని మండిపడుతూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రైల్వే జీఎం కార్యాలయం వైపు దూసుకెళ్లాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్నాలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు నవీన్‌యాదవ్, శ్రీగణేశ్, ఎంపీ రఘురామ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు మోత రోహిత్, దీపక్ జాన్, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.   

దక్షిణాది నేతలను అడ్డుకునే కుట్ర    

ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో తలపెట్టిన ర్యాలీకి దక్షిణాది నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మండిపడ్డారు. ర్యాలీకి వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లను కేటాయించాలని తమ పార్టీ ఎంపీలు అనిల్ యాదవ్, మల్లు రవి రైల్వే జనరల్ మేనేజర్‌కు దరఖాస్తు చేశారని, ఆరు రోజుల పాటు కాలయాపన చేసి చివరి నిమిషంలో రైళ్లు ఇవ్వలేమని నిరాకరించారని తెలిపారు.

ప్రధాని మోదీ, అమిత్ షా సూచనల మేరకే ఉద్దేశపూర్వకంగా రైళ్లను నిరాకరించారని, రైల్వే అధికారులను కలిసేందుకు వెళ్లిన వారి పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ప్రత్యేక రైళ్లు ఇవ్వకపోయినా ర్యాలీలో పాల్గొని తీరుతామని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు జన సమీకరణకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఢిల్లీ వేదికగా కేంద్ర నిరంకుశ పాలనపై నిరసన గళం వినిపిస్తామని, మోదీ ఫాసిస్టు పాలనకు నూకలు చెల్లాయని మహేశ్‌కుమార్‌గౌడ్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు