గాంధీజీ బాటలో సమాజ నిర్మాణానికి కృషి చేయాలి
- సత్యం, అహింసే శాంతియుత సమాజానికి పునాది.. సీపీ డా.ఎం.రమేష్
శేరిలింగంపల్లి,(విజయక్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీజీ(Mahatma Gandhi) జయంతి సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్(Cyberabad CP Ramesh) గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమం(Independence movement)లో గాంధీజీ అనుసరించిన సత్యం, అహింస, శాంతి, క్రమశిక్షణ సూత్రాలు నేటి సమాజానికి కూడా ఎంతో ప్రాసంగికమని అన్నారు.
గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారా సమాజంలో శాంతి, సోదరభావం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ చట్టాన్ని గౌరవించడం, బాధ్యతతో విధులు నిర్వర్తించడం పోలీసుల ప్రధాన కర్తవ్యమని తెలిపారు. గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన, శాంతియుత, సమానత్వ సమాజం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడ్మిన్ డీసీపీ అన్నపూర్ణ(Admin DCP Annapurna), హెడ్‌క్వార్టర్స్ డీసీపీ సంజీవ్, అదనపు డీసీపీలు షమీర్, హన్మంత్ రావు తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు.