గ్రేటర్‌లో అవినీతి అధికారులు

06-10-2026 | 05:25am
  1. ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత 
  2.    4 లక్షల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు
  3. లక్ష తీసుకుంటూ పట్టుబడ్డ రంగారెడ్డి డీఎంహెచ్‌వో
  4. ఆస్పత్రి రీ -ఓపెనింగ్ కోసం 2 లక్షలు డిమాండ్
  5. డ్రైవర్, హెల్త్ ఇన్‌స్పెక్టర్‌తో సహా డీఎంహెచ్‌వో అరెస్ట్

హైదరాబాద్ సిటీ బ్యూరో/రంగారెడ్డి బ్యూరో, అక్టోబర్ 5 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌లో(Greater Hyderabad) సోమవారం అవినీతి అధికారులు లంచం(Corrupt officials taking bribes) తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్ సునీత(GHMC Town Planning Supervisor Sunitha) 4 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడింది. లంచం తీసుకుంటూ రంగారెడ్డి డీఎంహెచ్‌వో స్వర్ణకుమారి, ఆమె డ్రైవర్ కృష్ణయ్య, హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ ఏసీబీకి పట్టుబడ్డారు.  జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోన్ (సర్కిల్-33, మెహదీపట్నం) టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా తులసిరామ్ సునీత పనిచేస్తున్నది.

భవన నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతించడం, జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్ జారీ చేసిన స్పీకింగ్ ఆర్డర్స్‌ను పక్కన పెట్టడం, ఎలాంటి వేధింపులు లేకుండా భవిష్యత్తులో సహకరించడం కోసం సదరు అధికారిణి ఫిర్యాదుదారుడి నుంచి రూ. 8 లక్షల లంచం డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 4 లక్షలు స్వీకరిస్తుండగా సిటీ రేంజ్- ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రూ. 4 లక్షల లంచం సొమ్ముతో పాటు, ఆమె స్వాధీనంలో ఉన్న మరో రూ.2.5 లక్షలు లెక్కల్లో లేని నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

మూతపడ్డ ఆస్పత్రి తెరిచేందుకు లంచం

నిబంధనల ప్రకారం జరగాల్సిన పని కోసం ఏకంగా లక్షల రూపాయలు డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ స్వర్ణ కుమారి, ఆమె కిందిస్థాయి సిబ్బంది సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఎల్బీనగర్ లో సబ్‌స్టాండర్డ్ (లైసెన్స్ లేదని) నెపంతో గతంలో సీజ్ చేసిన ఓ ఫిజియోథెరపీ ఆస్పత్రిని తిరిగి తెరవడానికి, కొత్త లైసెన్స్ మంజూరు చేయడానికి డీఎంఅండ్ హెచ్‌వో స్వర్ణకుమారి రూ.2 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

అధికారుల పక్కా వ్యూహం ప్రకారం, మొదటి విడతగా రూ.లక్ష ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. సోమవారం శివరాంపల్లిలోని డీఎంహెచ్‌వో కార్యాలయంలో బాధితుడు హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌కు రూ.లక్ష నగదును అందజేశాడు. శ్రీనివాస్ ఆ మొత్తాన్ని డీఎంహెచ్‌వో డ్రైవర్ కృష్ణయ్యకు ఇచ్చి కారులో పెట్టాలని సూచించాడు. కృష్ణయ్య ఆ నగదును కారులో ఉంచుతుండగా, నిఘా ఉంచిన ఏసీబీ బృందం దాడి చేసి నగదును స్వాధీనం చేసుకుంది. లంచం డిమాండ్‌కు సంబంధించిన డిజిటల్, ఆడియో, వీడియో ఆధారాలను సేకరించినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

జిల్లా అధికారి స్వర్ణ కుమారితో పాటు హెల్త్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, డ్రైవర్ కృష్ణయ్యలను అదుపులోకి తీసుకుని, నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు వారు తెలిపారు. గత ఏప్రిల్ 30న వికారాబాద్ నుంచి స్వర్ణకుమారి రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది. ఆరు నెలల్లోనే ఆమె లంచం కేసులో ఏసీబీకి చిక్కడం గమనార్హం. స్వర్ణ కుమారి పనితీరుపై మొదటి నుంచీ తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.

ఆమె వైఖరి సరిగ్గా లేదని, తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని స్వయంగా శాఖలోని సిబ్బందే పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. టీఎన్జీవో నాయకులతో కలిసి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు, జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి కూడా వినతిపత్రాలు అందజేశారు. ఆమెను తక్షణమే బదిలీ చేయాలని కోరినప్పటికీ చర్యలు తీసుకోలేదు.

మరిన్ని వార్తలు