హిందువులు సంఘటితం కావాలి

03-10-2026 | 11:25pm

- ఆలయాలకు రక్షణ కల్పించాలి 

- దాడి చేసిన వ్యక్తిని కఠిన చర్యలు తీసుకోవాలి 

- పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ 

- ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి 

- పుష్పగిరి పీఠాధిపతి ఆధ్వర్యంలో సంతోషిమాత ఆలయంలో సంప్రోక్షణ

ఎల్బీనగర్, అక్టోబర్ 3 : హిందువులు సంఘటితం కావాలని, హిందూ ఆలయాలకు(Hindu temples) రక్షణ కల్పించాలని, ఆలయాలపై దాడి పాల్పడిన వ్యక్తులను కఠిన చర్యలు తీసుకోవాలని పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ(Pushpagiri Peethadhipati Vidyashankara Bharati Swamiji), మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender), ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(Sudheer Reddy) తదితరులు అన్నారు. దిల్ సుఖ్ నగర్ లోని సంతోషిమాత ఆలయంలో(Santoshi Mata Temple) అమ్మవారి విగ్రహంపై దాడి చేసిన ఘటనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

విషయం తెలుసుకున్న బీజేపీ, హిందూ సంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. శనివారం ఉదయం  సంతోషిమాత ఆలయంలో పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు.  అమ్మవారి విగ్రహంపై నిన్న ఉదయం అనుచితంగా ప్రవర్తించిన ఘటన నేపథ్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామీజీ మాట్లాడుతూ.. కృష్ణుడి సారథ్యంలో అర్జునుడు ధర్మం కోసం పోరాడిన విధంగా సమాజం కూడా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

సంతోషిమాత దేవాలయాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సందర్శించారు. అమ్మవారి విగ్రహంపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను ఆలయ అర్చకులు, స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో జరిగిన ఘటన అత్యంత గర్హనీయమని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అందరూ చూస్తుండగా, అర్చకుల సమక్షంలోనే గర్భగుడిలోకి ప్రవేశించిన వ్యక్తి అమ్మవారి విగ్రహంపై కర్రలతో దాడికి పాల్పడటం హిందూ భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ తీసిందన్నారు. 

ఆలయ పవిత్రతకు భంగం కలిగించి, భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తిపై అత్యంత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దేవాలయాలపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దేవాలయాల భద్రతపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాజీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ..  దేవాలయాల పవిత్రతను కాపాడటంతోపాటు, ఇలాంటి ఘటనలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ నాయకుడు చికోటీ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎంతో కలిసి హిందూ ఆలయాల భద్రతను గాలికి వదిలేసిందన్నారు. హిందువులు సంఘటితంగా ఉంటూ దాడులను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 

-  ఆలయాల భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాలి

-  ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 సంతోషీమాత ఆలయంలో అమ్మవారి విగ్రహంపై దాడి జరిగిన ఘటనపై ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆలయంలోకి ఓ వ్యక్తి ప్రవేశించి అమ్మవారి విగ్రహంపై దాడికి పాల్పడిన ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, అసలు కారణాలను వెలికితీయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో గతంలోనూ ముత్యాలమ్మ, చిట్టిముత్యాలమ్మ, సంతోషీమాత ఆలయాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్న విషయాన్ని ప్రస్తావించారు. వరుసగా ఆలయాలకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో, వీటిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు.

ఆలయాల వద్ద, ముఖ్యంగా అమ్మవారి ఆలయాల వద్ద భద్రతను మరింత పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, ఆలయాల భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, ముద్ద కళ్యాణ్, చంద్రశేఖర్ అజాద్ తదితరులు పాల్గొన్నారు.

- దాడి చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదు 

- చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన కుటుంబీకులు 

సంతోషిమాత ఆలయంలో దాడికి పాల్పడిన అబ్దుల్ అన్సారీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అబ్దుల్ అన్సారీ పదేళ్లుగా మానసిక అనారోగ్యానికి చికిత్స పొందుతున్నాడని సోదరుడు ఆలం అన్సారీ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చేతనపురి పోలీసులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు