నరకయాతన

27-11-2026 | 07:35am
  1. అమీన్ పూర్ రోడ్డుపై మురుగు మోత.. అధికారుల మౌనం!
  2. నడిరోడ్డుపై డ్రైనేజీ ప్రవాహం.. ఎనిమిది నెలలుగా పట్టించుకునేదెవరు?
  3. ప్రజలకు కంపు.. అధికారులకు కనిపించని సమస్య?           
  4. అమీన్ పూర్ రోడ్డుపై మురుగు కష్టాలు.. జీహెచ్‌ఎంసీ చర్యలు ఎక్కడ?

అమీన్ పూర్/ పటాన్ చెరు: అమీన్ పూర్ ప్రధాన రహదారిపై(Aminpur Main Road) డ్రైనేజీ ఓవర్‌ఫ్లో సమస్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. గత ఎనిమిది నెలలుగా మురుగు నీరు రోడ్డుపైకి చేరి ప్రవహిస్తున్నా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై స్థానికులు, వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై మురుగు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు సాగించే సమయంలో మురుగు నీరు వాహనాల చక్రాల నుంచి చిమ్ముతూ ప్రయాణికులపై పడుతుండటంతో అసహ్యకర పరిస్థితులు నెలకొంటున్నాయి.

దుర్వాసనతో పరిసర ప్రాంత ప్రజలు, వ్యాపారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారిపై ఇలాంటి పరిస్థితి నెలకొని నెలలు గడుస్తున్నా సంబంధిత జీహెచ్‌ఎంసీ అధికారులు(GHMC officials) సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు నిత్యం వినియోగించే రహదారిపై మురుగు నీరు ప్రవహిస్తుండటం పారిశుద్ధ్య నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఎనిమిది నెలలుగా కొనసాగుతున్న ఈ సమస్యపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ ఓవర్‌ఫ్లోను అరికట్టి, రహదారిని శుభ్రం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు