పరిశ్రమల స్థాపనతోనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం
పారిశ్రామిక రంగ అభివృద్ధికి గ్లోబల్ సమ్మిట్
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
సిద్దిపేట జిల్లా ఆవుసులోనిపల్లిలో వింటేజ్ కాఫీ పరిశ్రమ ఏర్పాటుకు భూమిపూజ
గజ్వేల్, నవంబర్ 26: పరిశ్రమల స్థాపనతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను మరింత ఇనుమడింపజేసేందుకు డిసెంబరులో గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ పారిశ్రామికవాడ పరిధిలోని ఆవుసులోనిపల్లి శివారులో వింటేజ్ కాఫీ పరిశ్రమ ఏర్పాటుకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం కల్పిస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోందన్నారు.
విద్యుత్, తాగునీరు, రహదారులు, పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే రంగాలను ప్రోత్సహిస్తున్నామన్నారు. పరిశ్రమల అనుమతులు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలను సరళతరం చేశామని పేర్కొన్నారు. వింటేజ్ కాఫీ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 22 దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేయడం అభినందనీయమన్నారు. టీజీఐసీ ద్వారా ప్రభుత్వ స్థలాలను కేటాయిస్తూ పారిశ్రామికవాడలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 70 వేలకుపైగా ఉద్యోగాలు కల్పించామని, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలను మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డెయిరీ చైర్మన్ అమిత్‌రెడ్డి, వింటేజ్ కాఫీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలకృష్ణ పాల్గొన్నారు.