కొలువుల హామీ ఏమైంది?
- రాహుల్‌గాంధీకి కేటీఆర్ ప్రశ్న
- ఇరానీ చాయ్ తాగి ఇచ్చిన మాట మరిచారా!
- కాంగ్రెస్‌పై యుద్ధానికి యువత సిద్ధం
- రేవంత్ పాలనలో అన్నీ కష్టాలే
- రూ.6 లక్షలకు దిగజారిన పంచాయతీల వ్యయం
- ‘ఎక్స్’ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగా ల కల్పన, యువ వికాసం హామీలెక్కడికి పోయాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) విమర్శలు గుప్పించారు. మూడేళ్ల క్రితం హైదరాబాద్ అశోక్‌నగర్‌లో ఇరానీ చాయ్ తాగుతూ, ఫొటోలకు పోజులిస్తూ యువతకు ఇచ్చిన హామీలు గుర్తున్నాయా అని నిలదీశారు. గురువారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పాలన తీరుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ యువత నమ్మకాన్ని అపహాస్యం చేసిందని మండిపడ్డారు. రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకత్వం తెలంగాణ యువతకు చేసిందేమీ లేదని విమర్శిం చారు. ప్రత్యేక తెలంగాణ కోసం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడిన యువత మరోసారి పోరాటానికి సిద్ధమవుతుందని హెచ్చరించా రు. ఇది కేసీఆర్ గడ్డ అని, పోరాట యోధుల గడ్డ అని స్పష్టం చేశారు. యువతకు చేసిన ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదని హెచ్చరించారు.
పంచాయతీలు అస్తవ్యస్తం..
కేసీఆర్ పాలనలో అభివృద్ధి పనులతో కళకళలాడిన గ్రామాలు, కాంగ్రెస్ పాలనలో ఆర్థిక ఇబ్బందులతో వెలవెలబోతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. 2022 పంచాయతీల సగటు వ్యయం రూ.16.59 లక్షలుగా ఉండగా, 2024 నాటికి రూ.6.24 లక్షలకు పడిపోయిందన్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయిందన్నారు. అభివృద్ధి అటుంచితే కనీస సదుపాయాల నిర్వహణ కూడా సక్రమంగా లేదని ఆరోపించారు. పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ సేవలకూ ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధన దిశగా కేసీఆర్ ప్రభుత్వం కృషి చేసిందని, రేవంత్ రెడ్డి పాలనలో పంచాయతీల ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆందోళన వ్యక్తం చేశారు.