ఐటీకి లాగౌట్!
- 72% మంది సాఫ్ట్వేర్ రంగాన్ని వీడేందుకు రెడీ
- ప్రస్తుతం సంతృప్తిగా ఉన్నది 13శాతమే
- ఏఐ, లేఆఫ్‌లతో సడలుతున్న నమ్మకం
- తమ పిల్లలను ఐటీకి పంపేందుకు 56 శాతం మంది తల్లిదండ్రుల విముఖత
- వైద్యం, ప్రభుత్వ ఉద్యోగాల వైపు మొగ్గు
- ‘బ్లుండ్’సర్వేలో వెల్లడైన ఆసక్తికర వాస్తవాలు
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): లక్షల రూపాయల ప్యాకేజీలు.. విదేశీ ప్రయాణాలు.. అద్దాల మేడల్లో విలా సవంతమైన కొలువులు.. ఒకప్పుడు కోట్లాది మంది భారతీయ యువత కన్న అందమైన కల ఇది! కానీ, నేడు ఆ కలల సౌధం బీటలు వారుతోంది. ఒకప్పుడు ‘బంగారు బాతు’గా వెలుగొందిన ఐటీ రంగం(IT sector), ఇప్పుడు కత్తిమీద సాములా మారింది. వరుస లేఆఫ్‌లు, కృత్రి మ మేధ (ఏఐ) రూపంలో దూసుకొస్తున్న పెను సవాళ్లు టెకీల్లో వణుకు పుట్టిస్తున్నాయి.
‘జీతం తగ్గకుండా మరో రంగంలో అవకాశం వస్తే.. ఐటీ కొలువును వదిలేసి వెళ్లిపోతాం’ అంటూ 72 శాతం మంది ఉద్యోగులు తేల్చిచెప్పడం ఇప్పుడు పరిశ్రమ లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రొఫెషనల్స్ కోసం పనిచేసే ప్రముఖ కమ్యూనిటీ యాప్ ‘బ్లైండ్’ నిర్వహించిన తాజా సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. భారత్‌కు చెందిన 2,958 మంది ఐటీ, ఆర్థిక సేవల రంగాల ఉద్యోగులు సర్వే ద్వారా తమ మనోగతాన్ని వెల్లడించారు. ప్రస్తుత వేతన మే కొనసాగితే 42శాతం మంది మరో కెరీ ర్ను ఎంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ ఎలాంటి ఖర్చు, అదనపు శిక్షణ అవ సరం లేకుండా పూర్తిగా భిన్నమైన వృత్తిలోకి మారే అవకాశం వస్తే, ఏకంగా 72 శాతం మంది ఆసక్తి చూపారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం, రంగంతో సంతృప్తిగా ఉన్నామని కేవలం 13 శాతం మందే పేర్కొనడం ఐటీ రంగంలో పరిస్థితికి అద్దం పడుతోంది.
వెనుకాడుతున్న తల్లిదండ్రులు..
తమ పిల్లలను ఐటీ రంగంలోకి వెళ్లాలని ప్రోత్సహించబోమని 56 శాతం మంది స్పష్టం చేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఆ రంగంపై అనాసక్తి కనబరుస్తున్నారు. మైక్రో సాఫ్ట్‌లో పనిచేస్తున్న వారిలో 67 శాతం మంది తమ పిల్లలను ఐటీకి దూరంగా ఉండాలని సూచిస్తామని చెప్పారు. గూగుల్, అమెజాన్ ఉద్యోగుల్లోనూ 50 శాతానికి పైగా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ఒకప్పుడు ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలే మెరుగైన భవిష్యత్తుకు మార్గమని భావించిన పరిస్థితి ఇప్పుడు మారుతోంది.
తమ అనుభవాలను బట్టి తర్వాతి తరం యువతకు అదే రంగాన్ని సూచించేందుకు ఉద్యోగులు వెనుకాడుతున్నారు. ఉద్యోగ భద్రత, నిరంతర నైపుణ్యాభివృద్ధి అవసరం, ఏఐతో మారుతున్న పని స్వభావం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కెరీర్ ప్రారంభించాలనుకునే యువతకు ఏ రంగాన్ని సూచిస్తారని అడిగిన ప్రశ్నకు ఉద్యోగులు ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు.
34 శాతం మంది వైద్యం, ఆరోగ్య రంగాన్ని మొదటి ఎంపికగా సూచించారు. 19 శాతం మంది ఏఐ, మెషిన్ లెర్నింగ్ రంగాలను ఎంచుకున్నారు. ప్రభుత్వ, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగాలవైపు 15 శాతం మంది మొగ్గు చూపారు. అంటే ఒకవైపు ఏఐ ఆధారిత కొత్త అవకాశాలపై ఆసక్తి ఉన్నప్పటికీ.. మరోవైపు ఉద్యోగ భద్రత కల్పించే ప్రభుత్వ రంగాలపైనా యువతకు సానుకూల దృక్పథం ఉందని ఈ సర్వే సూచిస్తోంది. ఆసక్తికరంగా సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఈ జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. ఏడు కెరీర్ ఎంపికల్లో కేవలం 4 శాతం మంది మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌ను సూచించారు. గూగుల్, మెటా, ఎన్విడియా సంస్థల నుంచి ఒక్కరు కూడా ఈ వృత్తిని ఎంచుకోకపోవడం గమనార్హం. కంప్యూటర్ సైన్స్ చదవొచ్చుగానీ, తప్పనిసరిగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి.
అసంతృప్తికి ప్రధాన కారణాలు..
వరుస ఉద్యోగాల కోతలు (లేఆఫ్స్), పని ఒత్తిడి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. 2025 ఏడాదితో పోలిస్తే భారత్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ రంగాన్ని వీడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఉద్యోగులు కేవలం కంపెనీ మారడం గురించి కాకుండా.. అసలు ఐటీ రంగంలోనే కొనసాగాలా? వద్దా? అనే కీలక సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు.
ఐటీ రంగానికి కొత్త సవాళ్లు..
భారత్‌లో ఐటీ రంగం కోట్లాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోంది. విదేశాల నుంచి డబ్బును ఆర్జించడలోనూ కీలక పాత్ర పోషిస్తోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పుణె వంటి నగరాల్లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి ఉద్యోగ అవకాశాలే ప్రధాన ఉద్యోగావకాశాలుగా నిలిచాయి. అయితే ఇప్పుడు ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు కేవలం ఉద్యోగాల కోతలకే పరిమితం కావడం లేదు. ఏఐ, ఆటోమేషన్తో సంప్రదాయ సాఫ్ట్వేర్ ఉద్యోగాల స్వరూపం మారుతోంది. కంపెనీలు తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పాదకత సాధించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నిరంతరం మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా తమను తాము అప్డేట్ చేసుకోవాల్సి వస్తోంది. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే జీవితంలో స్థిరపడినట్టేననే భావన ఉండేది. ఇప్పుడు అదే ఉద్యోగం ఎంతకాలం కొనసాగుతుందనే అనిశ్చితి నెలకొంటుంది. అయితే ఈ సర్వేలో వెల్లడైన అభిప్రాయాలన్నీ ఐటీ రంగం పతనానికి సంకేతాలని భావించలేం. కానీ ఉద్యోగుల ఆకాంక్షలు, కంపెనీల నియామక విధానాలు, ఉద్యోగ భద్రత మధ్య అంతరం పెరుగుతున్నదనే విషయాన్ని మాత్రం ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
వివిధ సంస్థల్లో కెరీర్ మార్పునకు సిద్ధంగా ఉన్న ఉద్యోగుల శాతం ఇలా..
ఇంట్యూట్ : 89%
గోల్డ్‌మ్యాన్ సాచ్స్, పేపాల్: 87%
వీసా: 86%
ఎక్స్పీడియా గ్రూప్: 83%
ఒరాకిల్, సేల్స్‌ఫోర్స్: 79%
అడోబ్: 78%
మెటా, యాపిల్ వంటి టెక్ దిగ్గజ సంస్థల్లోనూ సగానికి పైగా ఉద్యోగులు ప్రస్తుత రంగాన్ని వదిలేందుకు మొగ్గు చూపడం గమనార్హం.