కోర్టు ఆదేశాల ఉల్లంఘన

27-11-2026 | 05:00am
  1. అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం
  2. భూవివాదంలో.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష!
  3. ఇద్దరికీ రెండు వారాల సాధారణ జైలు, 2వేల చొప్పున జరిమానా
  4. అప్పీలుకు వారం రోజుల గడువు

మేడ్చల్/శేరిలింగంపల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి): భూ వివాదానికి సంబంధించిన కేసులో గతంలో జారీ చేసిన కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి రాష్ట్ర హైకోర్టు(Telangana High Court) రెండు వారాల సాధారణ జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మరో వారం జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. ఈ తీర్పు పోలీసు శాఖలోనే కాకుండా న్యాయ, పరిపాలనా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 

మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో ఏపీలోని విశాఖపట్నంకు చెందిన హర్షవర్ధన్ అనే వ్యక్తికి కుటుంబ పంపకాల ద్వారా 15 ఎకరాల భూమి వచ్చింది. ఇందులో సుమారు 6 ఎకరాల భూమిని ఏపీలోని ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ప్రవీణ్‌తో 2022లో విక్రయ ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత దీనిపై ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. తాను భూమిని విక్రయించలేదని, నకిలీ డాక్యుమెంట్ సృష్టించారని హర్షవర్ధన్ పేర్కొనగా, అగ్రిమెంట్ ప్రకారం భూమి స్వాధీనం చేయ డం లేదని ప్రవీణ్ 2023లో మేడ్చల్ రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టులో సివిల్ దావా వేశారు. భూమి స్వాధీనానికి ఇతరులు ఆటంకం కలిగించవద్దని మద్యంతర ఇంజక్షన్ ఉత్తర్వులు పొందారు. సంబంధిత స్థలాన్ని 29 మందికి రూ.22 కోట్లకు ప్రవీణ్ అక్రమంగా విక్రయించాడని హర్షవర్ధన్ 2025లో ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుతో ప్రవీణ్ 2025 సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు పోలీస్ కస్టడీలో ఉన్నారు. ఈ సమయంలో ఈఓడబ్ల్యూ పోలీసుల సహకారంతో తనను ఆ స్థలం నుంచి బలవంతంగా ఖాళీ చేయించారని ప్రవీణ్ ఆరోపించారు. గత హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని 2025 డిసెంబరులో ప్రవీణ్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. 2024లో ఇచ్చిన ఉత్తర్వులు కచ్చితంగా పాటించాలని, దర్యాప్తు పేరుతో పోలీసులు, ఈఓడబ్ల్యూ అధికారులు సివిల్ వివాదంలో జోక్యం చేసుకోవద్దని ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలు అమలు చేయకపోవడంతో ప్రవీణ్ మరోసారి ఈ ఏడాది మే 5వ తేదీన రెండవ సివిల్ కోర్టులో దిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన సీపీ రమేష్, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు జైలు శిక్ష ఖరారు చేసింది.

కేసులో ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన హైకోర్టు ఇద్దరు అధికారులకు శిక్ష విధించింది. అయితే తీర్పుపై ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును వారం రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ గడువులో సంబంధిత ఉన్నత న్యాయస్థానం నుంచి శిక్ష నిలుపుదల ఉత్తర్వులు పొందాలని స్పష్టం చేసింది. అలాంటి ఉత్తర్వులు పొందడంలో విఫలమైతే హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి విధించిన శిక్షను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రభుత్వ యంత్రాంగంలో కీలక బాధ్యతలు నిర్వహించే అధికారులు సైతం న్యాయస్థానాల ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనన్న అంశాన్ని ఈ పరిణామం మరోసారి గుర్తుచేస్తోంది. 

మరిన్ని వార్తలు