కంటోన్‌మెంట్‌ను మల్కాజిగిరిలో విలీనం చేయాలి

27-11-2026 | 05:05am

నామినేటెడ్ వ్యవస్థ రద్దు చేసి కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించాలి

ఎమ్మెల్యే శ్రీగణేష్ డిమాండ్

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): కంటోన్‌మెంట్‌లో నామినేటెడ్ సభ్యుల వ్యవస్థను రద్దు చేసి, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలని ఎమ్మెల్యే శ్రీగణేష్(MLA Sriganesh) డిమాండ్ చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన సంవిధాన్ రక్షా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులతో పాటు ఒకే ఓటు హక్కు కల్పించిందన్నారు. 2015లో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరిగాయని, 2020లో మళ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా ఇప్పటివరకు నిర్వహించలేదని శ్రీగణేష్ ఆరోపించారు.

1952లో ఐదారు మంది సభ్యులతో ప్రారంభమైన బోర్డు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఎనిమిది మంది ఎన్నికైన సభ్యులతో కొనసాగిందని, ప్రస్తుతం ఒక్క నామినేటెడ్ సభ్యుడి చేతిలో పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రతి ఏడాది నామినేటెడ్ పదవులను అనుచరులు, వారసులకు కట్టబెడుతూ రాజరిక పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కంటోన్మెంట్ను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేసి, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో స్థానికులకు ఓటు వేసి కార్పొరేటర్లను ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు.

కంటోన్మెంట్కు రావాల్సిన సుమారు రూ.1,200 కోట్ల సర్వీస్ ట్యాక్స్ బకాయిలను కేంద్రం విడుదల చేయడం లేదని విమర్శించారు. ఈ సమస్యలపై ఎంపీ ఈటల రాజేందర్, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, పార్లమెంటరీ కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు, గవర్నర్‌కు లేఖలు పంపుతున్నట్లు తెలిపారు. అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహాలకు కూడా వినతిపత్రాలు సమర్పించినట్లు వెల్లడించారు.

సీఎం రేవంత్‌రెడ్డి, ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు కంటోన్మెంట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినప్పటికీ, కంటోన్మెంట్ బోర్డు, రక్షణ శాఖ నుంచి ఎన్‌ఓసీలు రాక పనులు నిలిచిపోయాయని శ్రీగణేష్ తెలిపారు. వచ్చే డిసెంబర్ లేదా జనవరిలో నామినేటెడ్ సభ్యుడి పదవీకాలాన్ని మరోసారి పొడిగించకుండా రద్దు చేయాలని శ్రీగణేష్ డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ విలీనం, ఎన్నికల నిర్వహణ కోసం ఈటల రాజేందర్ ఢిల్లీలో నిరాహార దీక్ష లేదా ఆమరణ నిరాహార దీక్ష చేపడితే, పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ శ్రేణులతో కలిసి తాను మద్దతుగా కూర్చుంటానని బహిరంగంగా ప్రకటించారు.

మరిన్ని వార్తలు