పండుగ వేళ ఆర్టీసీ బాదుడు !?

19-10-2026 | 05:20am
  1. ప్రయాణికులపై అదనపు చార్జీల మోత
  2. స్పెషల్ బస్సుల పేరుతో అధిక వసూళ్లు
  3. సామాన్యుల జేబులకు చిల్లు

సంగారెడ్డి, అక్టోబర్ 18 : దసరా పండుగ(Dasara Festival) వచ్చిందంటే చాలు వివిధ ప్రాంతాల్లో ఉపాధి కోసం నివసిస్తున్న ప్రజలు తమ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ జరుపుకునేందుకు సొంతూళ్లకు బయలుదేరుతారు. ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుని ప్రత్యేక బస్సుల పేరుతో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణ రోజుల్లో రూ.90గా ఉన్న బస్సు చార్జీని శుక్రవారం నుంచి రూ.120కు పెంచడంతో ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ పూట కుటుంబంతో సొంతూరికి వెళ్లాలన్న ఆశకు అధిక చార్జీలు అడ్డంకిగా మారుతున్నాయని వాపోతున్నారు.

స్పెషల్ బస్సుల పేరుతో అదనపు వసూళ్లు...

సాధారణ రోజుల్లో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించేందుకు రూ.90 చెల్లిస్తుండగా, ప్రస్తుతం రూ.120 వసూలు చేస్తున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. చార్జీలు ఎందుకు పెంచారని ప్రశ్నిస్తే ప్రత్యేక బస్సులు నడుపుతున్నందున అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాధానం ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరోవైపు సాధారణ బస్సులకే ఎక్స్ప్రెస్ బోర్డులు పెట్టి ప్రత్యేక బస్సుల పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే బస్సుల వర్గీకరణ, వర్తించే చార్జీల వివరాలను ఆర్టీసీ అధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది.

కానరాని అధికారుల పర్యవేక్షణ ? 

ప్రతి పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీ పెరగడం సహజం. అయితే ఇదే సమయంలో ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంతోపాటు చార్జీల విషయంలో పారదర్శకత పాటించాల్సిన బాధ్యత ఆర్టీసీ యాజమాన్యంపై ఉంది. ప్రత్యేక బస్సుల పేరుతో ఏయే సర్వీసులకు ఎంత చార్జీ వర్తిస్తుందో బస్టాండ్లలో స్పష్టంగా ప్రదర్శించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సాధారణ బస్సులను ఎక్స్ప్రెస్ బస్సులుగా నడుపుతున్నారనే ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూళ్లు జరుగుతున్నాయా లేదా అన్నది తేల్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పండుగ వేళ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాల్సిన ఆర్టీసీ అదనపు చార్జీలతో ప్రయాణికులకు భారంగా మారకూడదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై ఆర్టీసీ అధికారులను సంప్రదించగా వారు ఆందుబాటులోకి  రాలేదు.

మరిన్ని వార్తలు