పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన
అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఓపెన్ హౌస్
బెజ్జంకి, అక్టోబర్ 23: పోలీసుల విధులు, చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని బెజ్జంకి ఎస్ఐ తోట తిరుపతి(Bejjanki SI Thota Tirupati) అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం బెజ్జంకి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(Kasturba Gandhi Balika Vidyalaya) (కేజీబీవీ), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్ఐ తోట తిరుపతి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పనితీరు, పోలీసుల విధులు, శాంతిభద్రతల పరిరక్షణలో వారి పాత్ర గురించి విద్యార్థులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. మహిళల భద్రత, సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులకు వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం వెల్లడించవద్దని తెలిపారు.
ప్రజల రక్షణ కోసం విధులు నిర్వహిస్తూ ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకొని, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.