జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
టీయూడబ్ల్యూజేఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు
సూర్యాపేట, అక్టోబర్ 2 (విజయక్రాంతి): దీర్ఘకాలికంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని టి యు డబ్ల్యూజె (ఐజెయు) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాస్ రావు(Chalasani Srinivas Rao) డిమాండ్ చేశారు.
జిల్లా కేంద్రంలో శుక్రవారం టియుడబ్ల్యూజే (ఐజేయు) దేశవ్యాప్త డిమాండ్ల డే నిర్వహించాలన్న పిలుపుమేరకు ఎంజి రోడ్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నిరసన దీక్ష చేపట్టి, కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో చేసి, భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు రాసిన వినతి పత్రాన్న జిల్లా కలెక్టర్ కు అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరిని అవలంబిస్తున్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు వర్తింపచేయాలని, హెల్త్ కార్డులు, ఆరోగ్య భద్రత, కల్పించి అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు మంజూరు చేయాలన్నారు. అలాగే రైల్వే పాసులను కూడా యధావిధిగా అమలు చేయాలని, వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న జర్నలిస్టులకు కనీస వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే ఐజేయు సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోల నాగేశ్వరరావు, డాక్టర్ కృష్ణ బంటు, టియుడబ్ల్యుజె (ఐజెయు) జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయ్, జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి శంకరమంచి రవీందర్ శర్మ, జిల్లా కోశాధికారి గుంటూరు రాము, దాడుల నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షుడు బాదే రాము, సీనియర్ జర్నలిస్టులు వర్ధెల్లి అరుణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.