సదరం సర్టిఫికెట్లు అక్రమాలపై ఫిర్యాదు
- పెన్షన్ల దందాకు సదరం సర్టిఫికెట్లే కేంద్రం!
- వికలాంగులు, కళాకారుల పెన్షన్ల మంజూరులో అక్రమాలపై ఆరోపణలు
- ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేశారంటూ గ్రామస్థుల ఆరోపణలు
గరిడేపల్లి, సెప్టెంబర్ 22,(విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామంలో(Ganugabanda Village) సదరం సర్టిఫికెట్ల జారీ, పెన్షన్ల మంజూరు వ్యవహారంపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వికలాంగులు, కళాకారుల పెన్షన్ల కోసం కొందరి నుంచి రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు వసూలు చేసినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
వృద్ధాప్య పెన్షన్ల కోసం ఆధార్ కార్డుల్లో వయస్సును మార్చి చూపిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.గ్రామంలో సదరం సర్టిఫికెట్ల కోసం సుమారు 50 మంది దరఖాస్తు చేసుకోగా, అధికారులు నిర్వహించిన వెరిఫికేషన్‌కు 18 మంది హాజరైనట్లు సమాచారం. వీరిలో నలుగురి సర్టిఫికెట్లు నకిలీవిగా ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. అయితే ఈ వివరాలను సంబంధిత అధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.
వృద్ధాప్య పెన్షన్లు పొందేందుకు కొందరు ఆధార్ కార్డుల్లో వయస్సును మార్పు చేయించుకుంటున్నారనే ఆరోపణలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. బ్యాంకు ఖాతాలు, ఇతర రికార్డుల్లో ఉన్న వివరాలకు ఆధార్‌లోని వయస్సుకు మధ్య వ్యత్యాసాలు ఉన్నాయా? అనే కోణంలో విచారణ జరపాలని గ్రామస్థులు కోరుతున్నారు.
సదరం సర్టిఫికెట్లలో అవసరమైన వైకల్య శాతం సాధించేందుకు కొందరు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్టిఫికెట్లలో తక్కువ శాతం నమోదైనవారు హైదరాబాద్‌కు వెళ్లి మార్పులు చేయించుకుంటున్నారనే ఆరోపణలపైనా సమగ్ర విచారణ చేపట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రామంలో సదరం సర్టిఫికెట్లు, వికలాంగులు, కళాకారులు, వృద్ధాప్య పెన్షన్ల మంజూరుకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సోషల్ ఆడిట్ నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు. నిజమైన అర్హులకు మాత్రమే ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.కార్యక్రమంలో ఎంపీడీవో సరోజ,ఎంపీవో ఇబ్రహీం,డాక్టర్ నరేష్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు