రైస్ మిల్లర్పై క్రిమినల్ కేసు నమోదు
రూ. 7.85 కోట్ల ప్రభుత్వ ధాన్యం మళ్లింపు
మగనూర్: మగనూర్ మండలం(Maganur Mandal) వడ్వత్ గ్రామంలోని మెసర్స్ శంకరలింగేశ్వర రైస్ మిల్ లో భారీ ఎత్తున ప్రభుత్వ ధాన్యం మళ్లింపు జరిగినట్లు అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రభుత్వ నమ్మకాన్ని వమ్ము చేసినందుకు గాను మిల్లు ప్రొప్రైటర్ దండే తిమ్మన్నపై మగనూర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు(Criminal Case) నమోదైంది.
ఈ రోజు (22.10.2026) సివిల్ సప్లైస్ అధికారుల సంయుక్త తనిఖీల్లో రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన 3,238.862 మెట్రిక్ టన్నుల (80,972 బస్తాల) ధాన్యం మాయమైనట్లు తేలింది. ఇందులో రబీ 2024-25 సీజన్ కింద ఇచ్చిన ధాన్యంతో పాటు గతంలో భద్రత కోసం అప్పగించిన (కస్టోడియన్) ధాన్యం కూడా ఉంది. భౌతికంగా మిల్లు ఆవరణలో ఒక్క బస్తా ధాన్యం కూడా అందుబాటులో లేదు.
దుర్వినియోగం చేసిన ఈ ధాన్యం మొత్తం విలువ రూ. 7,85,30,829 గా అధికారులు లెక్కించారు. ప్రభుత్వ ధాన్యాన్ని అక్రమంగా మళ్లించి సొంత లాభం కోసం వాడుకున్నందుకు గాను, జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ శ్రీ చ.సైదులు ఫిర్యాదు మేరకు మగనూర్ ఎస్ఐ పి.అశోక్ బాబు కేసు నమోదు చేశారు.