ఆనందన, సెహగల్ ఫౌండేషన్లకు జాతీయ అవార్డు
హైదరాబాద్: తెలంగాణలోని మెదక్ జిల్లాలో సమాజ భాగస్వామ్యంతో చేపట్టిన నీటి సంరక్షణ కార్యక్రమాలకు గాను ‘ఆనందన - ది కోకా-కోలా ఇండియా ఫౌండేషన్(Coca-Cola India Foundation)’ మరియు ‘ఎస్ ఎమ్ సెహగల్ ఫౌండేషన్’లు ప్రతిష్టాత్మక జాతీయ గుర్తింపును సాధించాయి. 20వ సీఐఐ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ వాటర్ మేనేజ్మెంట్ 2026లో “బియాండ్ ది ఫెన్స్” విభాగంలో ఈ రెండు సంస్థలకు అవార్డు లభించింది.
జనవరి 2024 నుండి మార్చి 2025 వరకు అమలు చేసిన “సస్టైనబుల్ యాక్సెస్ టు సేఫ్ వాటర్” ప్రాజెక్ట్‌లో భాగంగా మెదక్ జిల్లా శివంపేట మండలంలోని ఏడు గ్రామాల్లో ఉన్న 15 సాంప్రదాయ చెరువులను పునరుద్ధరించారు. దీనిద్వారా దాదాపు 2.05 కోట్ల (205 మిలియన్) లీటర్ల నీటి నిల్వ మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ సామర్థ్యం ఏర్పడింది. చెరువుల్లో పూడికతీత, కట్టల బలవర్ధనం, స్థానిక ప్రజల భాగస్వామ్యం ద్వారా 15,000 మందికి పైగా ప్రజలకు నీటి భద్రత చేకూరడంతో పాటు 1,535 ఎకరాల వ్యవసాయ భూములకు సాగునీటి ఆధారం లభించింది.
ఈ ప్రాజెక్ట్ కింద దాదాపు 2.04 లక్షల ఘనపు మీటర్ల పూడికను తొలగించారు (ఇది దాదాపు 82 ఒలింపిక్ సైజు ఈత కొలనులకు సమానం). ఈ పూడిక మట్టిని 150 మంది వ్యక్తిగత రైతులకు, మూడు కమ్యూనిటీ గ్రూపులకు వ్యవసాయ భూముల్లో ఉపయోగించడానికి అందించారు. ఇది నేల సారాన్ని పెంచడానికి, సుదీర్ఘ నీటి యాజమాన్యానికి సహాయపడుతుంది.
ఈ గుర్తింపుపై కోకా-కోలా ఇండియా అండ్ సౌత్ వెస్ట్ ఆసియా పబ్లిక్ అఫైర్స్, కమ్యూనికేషన్స్ అండ్ సస్టైనబిలిటీ వైస్ ప్రెసిడెంట్ దేవ్యాని రాణా మాట్లాడుతూ.. "నీటి భద్రతను బలోపేతం చేయడానికి ఎస్ ఎమ్ సెహగల్ ఫౌండేషన్‌తో కలిసి మేము చేసిన కృషికి జాతీయ గుర్తింపు లభించడం ఆనందంగా ఉంది. సాంప్రదాయ చెరువుల పునరుద్ధరణ, స్థానిక కమ్యూనిటీ నిర్వహణ మరియు 500 మొక్కలు నాటడం ద్వారా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో నీటి లభ్యతను పెంచేందుకు మేము కృషి చేశాం" అని అన్నారు.
ఎస్ ఎమ్ సెహగల్ ఫౌండేషన్ ట్రస్టీ మరియు సీఈఓ అంజలి మఖిజా మాట్లాడుతూ.. "స్థానిక నీటి సమస్యలను పరిష్కరించడంలో సాంప్రదాయ చెరువుల పునరుద్ధరణ ఒక ముఖ్యమైన అడుగు. ఆనందన - ది కోకా-కోలా ఇండియా ఫౌండేషన్ మద్దతుతో, గ్రామీణ సంస్థలు మరియు స్థానిక ప్రజలతో కలిసి పనిచేశాం. 'ట్యాంక్ యూజర్ గ్రూప్స్' ఏర్పాటు, పోషకాలు కలిగిన పూడిక మట్టిని పొలాల్లో ఉపయోగించడం ద్వారా భవిష్యత్తులో ఈ వనరుల సంరక్షణలో స్థానిక ప్రజలే క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు" అని తెలిపారు. 'తరంగ్' ద్వారా స్థానిక అవసరాలకు తగిన పరిష్కారాలను చూపుతూ నీటి లభ్యతను పెంచడం, వ్యవసాయ జీవనోపాధికి మద్దతు ఇవ్వడం ప్రాధాన లక్ష్యంగా పెట్టుకున్నారు.