జూరాల ఆయకట్టులో ఎకరం ఎండినా వదిలిపెట్ట
యాది పెట్టుకో రేవంత్.. రైతులకు నీరు, కరెంట్ ఇవ్వలేని ప్రభుత్వం
కృష్ణా జలాలపై తెలంగాణకు స్పష్టమైన ప్రణాళిక ఏది?
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వనపర్తి, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి)/పెబ్బేరు: జూరాల ఆయకట్టు(Jurala Ayacut) కింద ఒక్క ఎకరం పంట ఎండిపోయినా ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) హెచ్చరించారు. ‘పెబ్బేరు చౌరస్తాలో చెపుతున్నా.. యాది పెట్టుకో రేవంత్.. జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం ఎండినా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy)ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జూరాల డ్యాంలో నీళ్లు ఉన్నా వాటిని రైతుల పొలాలకు(Farmers fields) అందించడంలో ప్రభుత్వానికి అవగాహన, ప్రణాళిక లేదని విమర్శించారు.
శనివారం వనపర్తి జిల్లా(Wanaparthy District) పెబ్బేరు మండలం గుమ్మడం క్రాస్ రోడ్డు వద్ద రైతులతో కేటీఆర్ మాట్లాడారు. అనంతరం గుమ్మడం విద్యుత్ సబ్ స్టేషన్‌ను పరిశీలించి లాగ్‌బుక్‌ను తనిఖీ చేశారు. విద్యుత్ సరఫరా పరిస్థితిపై అధికారులను ప్రశ్నించడంతో పాటు రైతులను నేరుగా అడిగి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. రైతులకు ఎన్ని గంటలు విద్యుత్ అందుతోందన్న దానిపై అధికారులు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో రైతులు చెబుతున్న పరిస్థితులకు తేడా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
రైతులు అవసరమైన సమయంలో సాగునీరు, విద్యుత్ అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. లో -వోల్టేజీ, తరచూ విద్యుత్ అంతరాయాలతో వ్యవసాయ మోటార్లు దెబ్బతింటున్నాయని, కాలువలకు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. రైతుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. రైతులకు వాస్తవంగా ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తున్నారో లాగ్‌బుక్‌లో కాకుండా పొలాల్లోకి వెళ్లి చూడాలని, రైతులను అడిగితే అసలు పరిస్థితి తెలుస్తుందని అన్నారు.
విద్యుత్ సరఫరాపై అధికారులు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ప్రాంతానికి సమీపంలోనే రైతులు సాగునీరు, విద్యుత్ సమస్యలపై రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ విమర్శించారు. కొండారెడ్డిపల్లి రైతులు సైతం విద్యుత్ సమస్యలపై ఆందోళనకు దిగుతున్నారని ప్రస్తావించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని హెచ్చరించారు.
జూరాల ఆయకట్టు రైతులకు అన్యాయం జరిగితే బీఆర్‌ఎస్ వారి తరఫున పోరాడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు తమ హయాంలోనే దాదాపు 90 శాతం పూర్తయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. మిగిలిన 10 శాతం పనులు కాంగ్రెస్ సర్కారు పూర్తి చేయకుండా పాలమూరు రైతులను సాగునీటికి దూరం చేస్తున్నారని ఆరోపించారు. పెండింగ్ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
కృష్ణా జలాలపై ప్రణాళిక ఏదీ?
కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవాలని కేటీఆర్ అన్నారు. కర్ణాటక, ఏపీ తమ నీటి ప్రయోజనాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు అంశాన్ని ప్రస్తావిస్తూ భవిష్యత్తులో పాలమూరు ప్రాంతంపై దాని ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. తెలంగాణకు కృష్ణా జలాల్లో దక్కాల్సిన వాటాను కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీకి నీళ్లు వెళ్తుంటే తెలంగాణకు ఎందుకు రావు?
పోతిరెడ్డిపాడు, వెలిగొండ తదితర మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీరు వెళ్తుంటే తెలంగాణ రైతులకు నీరు ఎందుకు అందడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. జూరాలకు ఎగువ ప్రాంతాల నుంచి నీరు రావడం లేదనే కారణంతో కాలువలకు నీటి విడుదలను నిలిపివేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించి జూరాల ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులను అవసరానికి అనుగుణంగా నిర్వహించాలని కోరారు.
సాగునీరు, విద్యుత్, కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి అంశాలపై ప్రభుత్వం తక్షణమే కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కేటీఆర్ పర్యటనలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు తదితరులు పాల్గొన్నారు.