మహర్షి వాల్మీకి ఆశయాలు ఆదర్శనీయం
వాల్మీకి జయంతి వేడుకల్లో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ సత్యశారద
వరంగల్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): వాల్మీకి మహర్షి జీవితం, ఆయన బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద(Collector Dr. Satya Sharada) పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకల్లో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ మహాకావ్యం మానవ జీవితానికి మార్గదర్శకమని, అందులోని నీతి, ధర్మం, సత్యం, మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. మహర్షి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం శుభపరిణామమన్నారు.
కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ. వాల్మీకి చూపిన మార్గంలో నడుస్తూ విద్యకు ప్రాధాన్యతనిచ్చి సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. రామాయణంలోని విలువలను యువత అలవర్చుకోవాలని గ్రంథాలయ సంస్థ చైర్మన్ మీసాల ప్రకాశ్, మేర కార్పొరేషన్ చైర్మన్ సంగ వెంకటరాజం అన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్.కిషోర్ కుమార్, వై.వి.గణేష్, బీసీ సంక్షేమ శాఖ ఏడీ పుష్పలత, వివిధ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.