అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణమా?
ప్రగతి నగర్లో ఎయిర్టెల్ టవర్‌పై ప్రజాగ్రహం.. వెంటనే తొలగించాలని డిమాండ్!
చుట్టుపక్కల ప్రజల అభ్యంతరాలు పట్టించుకోకుండా నిర్మాణం ఎలా చేపడతారు?
13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులకు ఫిర్యాదు
ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి పట్టణంలోని 13వ వార్డు ప్రగతి నగర్లో అనుమతులు లేకుండా ఎయిర్టెల్ సెల్ టవర్ నిర్మాణం(Construction of Airtel cell tower) చేపడుతున్నారంటూ స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటి నంబర్ 1-4-27లో జరుగుతున్న సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు.
బొక్క లక్ష్మమ్మ, భర్త లేట్ మల్లారెడ్డి నివాసంపై సెల్ టవర్ నిర్మాణం(Construction of cell tower) చేపడుతున్నారని, దీనిపై చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజల నుంచి ఎలాంటి అభ్యంతర రహిత పత్రాలు (NOC) తీసుకోలేదని స్థానికులు ఆరోపించారు. పురపాలక సంఘం నుంచి అవసరమైన అనుమతులు పొందినట్లు కూడా తమకు తెలియదని పేర్కొన్నారు.
ప్రజారోగ్యంపై ఆందోళన.. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం!
నివాస ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటు చేయడం వల్ల రేడియేషన్ ప్రభావం(Effect of radiation)పై చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ప్రజల అభ్యంతరాలను పట్టించుకోకుండా నిర్మాణ పనులు కొనసాగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేయడంతో నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని, అధికారులు మారిన ప్రతిసారీ మళ్లీ పనులు ప్రారంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు, కౌన్సిలర్ ప్రశ్నించినప్పటికీ నిర్మాణదారుల నుంచి సరైన స్పందన రావడం లేదని తెలిపారు.
టవర్ నిర్మాణంపై సమగ్ర విచారణ జరపాలి
13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష్ శ్రీనివాస్(Ward Councilor Gurrala Santosh Srinivas)కు వార్డు ప్రజలు అందించిన వినతిపత్రం ఆధారంగా ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సెల్ టవర్ నిర్మాణానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ, పురపాలక అనుమతులను పరిశీలించి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరుగుతున్నట్లు తేలితే వెంటనే తొలగించాలని కోరారు. ప్రజల అభిప్రాయాలను, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుర్రాల సంతోష్ శ్రీనివాస్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, జనగాం నర్సింహాచారి, ఏంపల్ల పాపిరెడ్డి, చిన్న గౌరీ శంకర్, హీరాకర్ రాజేశ్వర్, మోలుగురి ప్రకాష్, చేరుతోట్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.