గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు..

02-10-2026 | 03:41pm

ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఐజేయూ వినతి..

ఆలేరు, అక్టోబర్ 2 (విజయక్రాంతి): గాంధీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(Telangana Union of Working Journalists) (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాల్లో జర్నలిస్టులు వినూత్న కార్యక్రమం నిర్వహించారు. ఆయా మండల కేంద్రాల్లోని మహాత్మా గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించి జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు, గుండాల, మోటకొండూరు, రాజపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, అడ్డగూడూరు మండలాలతో పాటు భువనగిరి నియోజకవర్గ పరిధిలోని భువనగిరి, బీబీనగర్, వలిగొండ, బొమ్మలరామారం, పోచంపల్లి, చౌటుప్పల్ తదితర మండలాల్లో ఐజేయూ నాయకులు, జర్నలిస్టులు గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా, జర్నలిస్టుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరించాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, అక్రిడిటేషన్లు, ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

అనంతరం భువనగిరిలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఐజేయూ రాష్ట్ర నాయకులు, జిల్లా, మండల నాయకుల ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఐజేయూ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, ఆయా ప్రాంతాల జర్నలిస్టులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు