రోడ్డు పక్కనే వ్యర్థాల దహనం.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

02-10-2026 | 04:17pm
  1. గొల్లపల్లి పత్తి నూనె మిల్లు నిర్వాకంపై గ్రామస్తుల ఆగ్రహం
  2. పొగతో ఉక్కిరిబిక్కిరి.. పంటలపై బూడిద.. జిల్లా కలెక్టర్‌ స్పందించాలని గ్రామస్తుల డిమాండ్

పెద్దపల్లి, అక్టోబర్ 2 (విజయక్రాంతి) పెద్దపల్లి మండలం సబితం గ్రామపంచాయతీ(Sabitham Gram Panchayat) పరిధిలోని గొల్లపల్లి శివారులో పత్తి నూనె మిల్లు యాజమాన్యం వ్యర్థాలను ఇష్టారాజ్యంగా రోడ్డు పక్కనే పడేసి తగలబెడుతోందని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ప్రధాన రహదారి పక్కనే వ్యర్థాలను గుట్టలుగా పోసి నిప్పు పెట్టడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ, దుర్వాసనతో నిండిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొగతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

వ్యర్థాల దహనం కారణంగా వెలువడుతున్న పొగతో రహదారిపై వెళ్లే ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ముఖ్యంగా గాలి వీచిన సమయంలో పొగ గ్రామాల వైపు వ్యాపిస్తోందని అంటున్నారు. దీనివల్ల వృద్ధులు, చిన్నారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంటలపై బూడిద.. రైతుల్లో ఆందోళన

మంటల నుంచి ఎగిసిపడుతున్న బూడిద సమీపంలోని పంట పొలాల్లో చేరుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు భూమి సారంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యర్థాలను రోడ్డు పక్కన పడేయడం, బహిరంగంగా దహనం చేయడాన్ని అడ్డుకోవాలని కోరుతున్నారు.

ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా

ఈ సమస్యపై గ్రామపంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌ ప్రత్యేకంగా స్పందించి సంబంధిత అధికారులతో విచారణ చేయించి, బహిరంగంగా వ్యర్థాల దహనానికి అడ్డుకట్ట వేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం, రైతుల పంటలకు నష్టం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు