గుస్సాడీ నృత్యాలతో పల్లెల్లో పండగ శోభ..
- సాంప్రదాయ వేడుకలు...
- గిరిజనగూడాల్లో భోగి పండుగ...
- దండారి ఉత్సవాలకు శ్రీకారం చుట్టిన ఆదివాసులు...
ఉట్నూర్ (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడాలలో బండారి దీపావళి ఉత్సవాలకు భోగి పూజలతో ఆదివారం దండారి ఉత్సవాల(Dandari Festival)కు శ్రీకారం చుట్టారు. వారం పది రోజుల పాటు అత్యంత వైభవంగా దండారి పండుగను జరుపుకునేందుకు డప్పుల వాయిద్యాలతో శ్రీకారం చుట్టారు. ఆదివాసుల సంస్కృతి... సాంప్రదాయాలు... ఆచార వ్యవహారాలకు ప్రతీకగా నిలిచే దండారి ఉత్సవాల సందర్భంగా రాత్రి పగలు అని తేడా లేకుండా డప్పుల మోతలు, గజ్జల చప్పుడు.. సాంప్రదాయ గీతాలతో ప్రత్యేక నృత్యం పండగ శోభను సంతరించుకుంటున్నాయి. పండగ సందర్భంగా పది రోజుల పాటు ఆదివాసుల డప్పు, తుడుం, కాళీ కోమ్, పేప్రే(సన్నాయి వాయిద్యాలు), కోలాటం నృత్యం, గుండెల పాటలతో గిరిజన గూడాలు మారు మ్రోగడం ప్రారంభమయ్యాయి.