తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు..

01-11-2026 | 06:12pm

అర్ధరాత్రి 2 గంటలకు మరమత్తు పనులను స్వయంగా పరిశీలించిన చైర్‌పర్సన్...

ఆదిలాబాద్, నవంబర్ 01, (విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణానికి ప్రధానంగా తాగునీటిని సరఫరా చేసే 600 డయా ప్రధాన పైపులైన్‌కు ఏర్పడిన భారీ లీకేజీని అరికట్టేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన మరమ్మతు పనులు నిరంతరాయంగా కొనసాగాయి. 

మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్(Municipal Chairperson Bandari Anusha Satish) శనివారం ఉదయం ప్రారంభమైన ఈ పనులను అర్ధరాత్రి 2 గంటల వరకు అక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షించారు. మరమ్మతులు పూర్తి చేసి తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నీటి సరఫరాను ప్రారంభించగా, పైపులైన్‌లో ఏర్పడిన అధిక ప్రెషర్ కారణంగా టీ-జాయింట్ వద్ద మరోసారి భారీ లీకేజీ ఏర్పడింది.

దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై తిరిగి మరమ్మతు పనులను చేపట్టారు. లీకేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, రేపటి వరకు పనులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. పైపులైన్ మరమ్మతులతో పాటు సంబంధిత ప్రాంతంలో సిమెంట్ కాంక్రీట్ పనులు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా చైర్‌పర్సన్ అనూష మాట్లాడుతూ అదిలాబాద్ పట్టణ ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అధికార యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. పట్టణానికి నిర్మల్ నుంచి తాగునీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో సాంకేతిక సమస్యలు, విద్యుత్ అంతరాయాల కారణంగా నీటి సరఫరాలో జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రానున్న రోజుల్లో నీటి కొరత, విద్యుత్ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

నీటిని వృథా చేయడం వల్ల ఇతరులకు తాగునీటి ఇబ్బందులు ఏర్పడతాయని తెలిపారు. అదేవిధంగా ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు ఫ్యాన్లు, లైట్లు ఆఫ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ నవీన్ కుమార్, డీఈ సందీప్ కుమార్, ఈఈ అరుణ్ కుమార్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, లైన్మెన్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు